అసెంబ్లీ వైపు చూస్తున్న జేడీ లక్ష్మినారాయణ.?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ అలియాస్ జేడీ లక్ష్మినారాయణ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఆయన ఓటమి చవిచూశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే లక్ష్మినారాయణ జనసేనకు దూరమయ్యారు.

ప్రస్తుతం రాజకీయంగా ఒంటరి ప్రయాణం చేస్తున్న జేడీ, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి చేయాలన్నదానిపై కసరత్తులు ముమ్మరం చేశారు. దాదాపు అన్ని పార్టీల నుంచీ ఆయనకు ఆఫర్లు వున్నాయి. విశాఖ ఎంపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని జేడీ లక్ష్మినారాయణ పైకి చెబుతున్నారు.

అయితే, తెరవెనుకాల ఆయన వ్యూహాలు వేరేలా వున్నాయట. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈసారి ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై తనతో సంప్రదింపులు జరుపుతున్న ఆయా పార్టీలకు ఓ స్పష్టత కూడా ఇచ్చేశారట జేడీ లక్ష్మినారాయణ.

విశాఖ పరిధిలోనే పోటీ చేయాలన్నది జేడీ లక్ష్మినారాయణ ఆలోచన అట. కాని పక్షంలో రాయలసీమ నుంచి.. అందునా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బావుంటుందని జేడీ లక్ష్మినారాయణ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ నుంచి అయితే ఆయనకు టిక్కెట్ విషయమై ఎలాంటి అభ్యంతరాలూ వుండకపోవచ్చు. బీజేపీ కూడా ఆయనకు కోరుకున్న చోట టిక్కెట్ ఇస్తామంటోందిట. అయితే, ఎంపీగానే పోటీ చేయమని ఆ పార్టీలు కూడా ఆయనకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో బీజేపీ నుంచి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగతారని, 2019 ఎన్నికలకు ముందు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.! అప్పటికి ఆయన ఇంకా ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. ఆ తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారాయ్.!