చంద్రబాబు గాలి తీసేసిన జేసి

అనంతపురం తెలుగుదేశంపార్టీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి గురించి కొత్తగా పరిచయటం అవపరంలేదు. నిర్మొహమాటంగా మాట్లాడుతానని, ఉన్నది ఉన్నట్లు చెబుతాననే ముసుగులో పార్టీల అధినేతలను ఎన్నోసార్లు ఇబ్బందుల్లోకి నెట్టేశారు. తాజాగా చంద్రబాబును ఉద్దేశించి అటువంటి వ్యాఖ్యలే చేసి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ప్రత్యేకహోదా, రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్ర వైఖరికి నిరసనగా ఢిల్లీలో దీక్ష చేద్దామని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ విషయమే ఎంపి మాట్లాడుతూ, చంద్రబాబు దీక్ష వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదంటూ కుండబద్దలు కొట్టారు.

చంద్రబాబు ఎన్ని దీక్షలు చేసినా ఉపయోగం లేదని జేసి అభిప్రాయపడ్డారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో దీక్షలు చేసి ఉపయోగం ఏమిటని కూడా నిలదీశారు. జేసి అడిగిన ప్రశ్న నూటికి నూరుపాళ్ళు నిజమే. నాలుగేళ్ళ పాటు ఎన్డీఏలో బిజెపితో అంటకాగారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోయినా పల్లెత్తు మాటనలేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాష్ట్రప్రయోజనాలను కేంద్రానికి చంద్రబాబు తాకట్టుపెట్టేశారు. రాబోయే ఎన్నికల్లోగా నియోజకవర్గాల సంఖ్యను పెంచుకోవాలన్నదే చంద్రబాబు లక్ష్యం. అది సాధ్యం కాదని తెలియగానే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు. అంత వరకూ కేంద్ర వైఖరికి నిరసనగా పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రతీదశలోను అడ్డుకున్నారు.

అలాంటిది ఇపుడు ఎన్నికలకు ముందు తానే దీక్షకు కూర్చుంటానని చంద్రబాబు చెబితే నమ్మేవారు ఎవరూ లేరు. ఆ విషయం పార్టీలోని అందరికీ బాగా తెలుసు. అయినా ఎవరు మాట్లాడకుండా బ్రహ్మాండమంటూ చంద్రబాబును పొగిడారు.  అందుకే జేసి చెప్పిన మాటలతో పార్టీలో కలకలం మొదలైంది. ఆమధ్య ఉక్కు ఫ్యాక్టరీ కోసం టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కడపలో నిరాహారదీక్షలు చేసినపుడు కూడా జేసి ఇలాగే మాట్లాడారు. దీక్షల వల్ల ఉక్కు రాదు..తుక్కు రాదంటూ వేదిక మీదే స్పష్టంగా చెప్పటం సంచలనమైంది. కాబట్టి ఇపుడు కూడా జేసి వ్యాఖ్యల వల్ల చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయటం కేవలం ఓట్ల కోసమే అని అర్ధమైపోతోంది.