మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు రోజుకొక విధంగా మారిపోతోంది. గతంలో వైసీపీ ఎమ్మెల్యే తన ఇంటి మీదకు వచ్చి దౌర్జన్యం చేస్తే పోలీసులు చూస్తూ ఊరుకున్నారని, ఎమ్మెల్యేకి సపోర్ట్ ఇచ్చి తన మీద తన వర్గం మీద కేసులు పెట్టారని దుమ్మెత్తిపోసిన జేసీ పంచాయతీ ఎన్నికల సందర్బంగా పోలీసుల పనితీరును కొనియాడారు. తాడిపత్రిలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందన్న ఆయన.. 70 నుంచి 80 శాతం పోలింగ్ నమోదవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు బ్రహ్మండంగా పనిచేశారని.. గెలుపోటములు సహజమని, పోలిసుల పనితీరుకు హ్యాట్సాఫ్ చేస్తున్నానని అన్నారు.
ఒకవైపు చంద్రబాబు నాయుడేమో పోలీసుల పనితీరు మీద విరుచుకుపడుతున్న సమయంలో జేసీ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. పోలీస్ శాఖ అధికార పక్షానికి కొమ్ముకాస్తూ టీడీపీని అణగదొక్కడానికి చూస్తోందని, అభ్యర్థులను భయబ్రాంతులకు గుర్తుచేస్తున్నారని, జగన్ పోలీసులను తమ మీదకు ఉసిగొల్పుతున్నారని ఆరోపణలు చేశారు. కానీ జేసీ మాత్రం పోలీసులకు సెల్యూట్ చేస్తున్నాను అనడంతో చంద్రబాబుగారి మాటల్లో గాలిపోయింది. టీడీపీ నేతలే పోలీస్ల పనితీరును మెచ్చుకుంటుంటే చంద్రబాబుగారేమో ఇలా తిడుతున్నారేమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇక వ్యతిరేక మీడియా అయితే ఈ అంశాన్ని గట్టిగా హైలెట్ చేసి జేసీ వ్యాఖ్యలను రైట్ అనేసింది.
అయితే జేసీ స్వరం తొందరగానే మారిపోయింది. ఎన్నికలు జరిగిన తీరు మీద ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు వారధి కాకుండా ఎన్నికల్లో ఓట్లు వేయించేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నారని విమర్శించారు. ఆ వ్యవస్థను వెంటనే తీసేయాలని డిమాండ్ చేశారు. కుప్పంలో కూడా ఎవరిని నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ పూర్తిగా భయబ్రాంతులకు గురి చేసి ఏకపక్షంగా గెలిచామని గొప్పలు చెప్పుకుంటున్నారని, వాలంటీర్ వ్యవస్థను వెంటనే తీసివేయాలని అన్నారు. మొదట్లో పోలీసుల తీరును మెచ్చుకున్న ఆయన ఇప్పుడేమో వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నా పోలీసులు ఏమీ పట్టించుకోలేదన్నట్టు మాట్లాడటం చూస్తే చంద్రబాబు నుండి ఆయనకు ఫోన్ కాల్ వెళ్లి ఉంటుందని, అది గట్టిగానే పనిచేసి ఉంటుందని అనిపిస్తోంది.
JC Prabhakar Reddy, TDP, Chandrababu Naidu, Ananthapuram, Tadipatri, జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ, వైసీపీ, అనంతపురం, చంద్రబాబు నాయుడు, పంచాయతీ ఎన్నికలు