జెసి దివాకర్ రెడ్డి ఈ పేరు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎందుకంటే ఏపీ రాజకీయాలలో ఆయనో సంచలనం. ఏ మాటనైనా నిర్మొహమాటంగా చెప్పటం ఆయన ప్రత్యేకత. రాష్ట్ర విభజనకు ముందు వరకు కాంగ్రెస్ లో ఉన్న ఆయన 2014లో టిడిపిలో చేరి అనంతపురం ఎంపీగా గెలిచారు. జెసి దివాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆయన స్టైల్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. టిడిపి అవిశ్వాసం పెడితే దానిలో పాల్గొననని, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి ఈ మధ్య చర్చనీయాంశమయ్యారు జెసి దివాకర్ రెడ్డి. తాజా రాజకీయ పరిణామాలపై జెసి దివాకర్ రెడ్డి తెలుగురాజ్యం ప్రతినిధి గణపతితో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే… తెలుగు రాజ్యంతో జెసి చేసిన సంభాషణను మీరూ వినండి.
ఎన్నికలలో పోటీ చేయాలనే ఆలోచన లేదని ప్రజాస్వామ్యంలో విలువలు తగ్గిపోయాయన్నారు. తను రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉందన్నారు. ఈ దేశంలో సీఎం, పీఎంలే ముఖ్యులయ్యారని వారే రాజులుగా, మహారాజులుగా వెలుగుతున్నారని విమర్శించారు. అమెరికాలోని అధ్యక్ష తరహా విధానం రావాలని ఆయన అన్నారు. సీఎం, పీఎం తప్ప మిగిలిన వారంతా ఆటబొమ్మలయ్యారని జెసి దివాకర్ రెడ్డి విమర్శించారు.
తమ కుటుంబానికి నీడనిచ్చింది కాంగ్రెసేనని కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ ద్రోహం చేసిందని ఆయన దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ కు 10 నుంచి 15 సీట్లు వస్తాయోమో కానీ అతనికి కులాన్ని అంటగట్టే అవకాశం ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డి అరిగిపోయిన రికార్డు అని ఎద్దేవా చేశారు. తన నాన్న పేరుతో జగన్ రాజకీయం చేస్తున్నారని జెసి విమర్శించారు. తన కుమారుడు రాజకీయాల్లోకి రావాలని ఆశపడుతున్నాడని, నేనెప్పుడు అతనిని ఎంకరేజ్ చేయనని జెసి తెలిపారు.
చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తారని జెసి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని సమస్యలున్నా వ్యవసాయానికి చంద్రబాబు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారని అందుకే ప్రజలు చంద్రబాబును గుర్తించగలిగారని జెసి అన్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు టిడిపి మంచి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జగన్ రెడ్డి పేరుతో రాజకీయం చేయాలని చూస్తున్నారని అది పనికిరాదని జెసి అన్నారు. ఇంకా ఆయన తన మాటల్లో చెప్పిన ఇంటర్వ్యూ విషయాలను ఆడియో టేపులో (పాడ్ కాస్టు) మీరే వినండి