బాబుకు కాదు.. ఇప్పుడు జెసి కి తగిలింది షాక్

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే ఆ పార్టీకి కాంగ్రెస్ సహా అనేక ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. జాతీయ స్థాయిలో ఈ విషయంలో టిడిపిక మాంచి మైలేజ్ వచ్చింది. ఇక అవిశ్వాసం విషయంలో క్షణ క్షణం ఏం జరుగుతుందో టెలికాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు ఢిల్లీ సమాచారం సేకరిస్తున్నారు. ఎంపీలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

కానీ అవిశ్వాసం విషయంలో దేశంలోని పార్టీలన్నీ ఒకవైపు చంద్రబాబుకు మద్దతు ఇస్తుంటే మరోవైపు టిడిపికి చెందిన అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి మాత్రం చంద్రబాబుకే ఝలక్ ఇచ్చారు. అదేమంటే ఆయన తనదైన శైలిలో మాట్లాడారు. ‘‘నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు.. నేను ఢిల్లీకి పోయి ఏం చేస్తా.. అనంతపురంలోనే ఉంటా.. అయినా అవిశ్వాసం నెగ్గలేమని తెలిసినా పెట్టుడెందుకు?’’ అని ఆయన బాబు వైఖరిని ఓపెన్ గానే వ్యతిరేకించారు. ఒకింత నిష్టూరమాడారు. మొత్తానికి అవిశ్వాసం విషయంలో చంద్రబాబుకు తలనొప్పి తెచ్చి పెట్టారని అనుకుంటున్నవేళ సరిగ్గా అనంతపురంలోనే జెసికి పెద్ద షాక్ తగిలింది.

జెసి వైఖరిని రాయలసీమ వామపక్ష నేతలు వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ హక్కులు కాలరాసే విధంగా కేంద్రం వ్యవహరిస్తుంటే అవిశాసానికి పోయి ఓటేయను ఇంట్లోనే ఉంటా అని జెసి మాట్లాడడం సరికాదని వామపక్ష నేతలు అంటున్నారు. అంతేకాదు గురువారం అనంతపురంలోని జెసి ఇంటిని ముట్టడించారు వామపక్ష నేతలు. తక్షణమే జెసి ఢిల్లీకి పయనం కావాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. జెసి ఇంటి ముందు ధర్నాకు కూర్చున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

అసలే జాతీయ స్థాయిలో మైలేజీ కొట్టేసిన చంద్రబాబుకు జెసి షాక్ ఇచ్చాడనుకుంటే.. వామపక్ష నేతలు వచ్చి జెసికే షాక్ ఇచ్చారని అనంతపురంలో చర్చించుకుంటున్నారు.

మరి పార్టీ నేతల వత్తిళ్లు, బాబు సూచనలు, వామపక్ష నేతల వత్తిడి పరిగణలోకి తీసకుని అవిశ్వాసానికి జెసి పోతారా? లేక ఐ డోంట్ కేర్ అని ఇంట్లనే ఉంటరా అన్నది ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయింది.