అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన మాట తీరే అంతా అని నేతలందరికి తెలుసు. ఆయన జోక్ మాట్లాడినా, సీరియస్ గా మాట్లాడినా అది హాట్ టాపికే. తాజాగా వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ ల పై జెసి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ కులం ప్రాతిపదికన ఓట్ల అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. పెళ్లిలు చేసేటప్పుడు అడ్డురాని కులం ఓట్లు అడిగేటప్పుడు ఎందుకని ప్రశ్నించారు. జెసి దివాకర్ రెడ్డి ఏం అన్నారో ఆయన మాటల్లోనే…
“ రెడ్డి.. రెడ్డి.. రెడ్డి.. అంటూ వైఎస్ జగన్ కుల ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారు. పెళ్లిళ్లు చేసుకునేటప్పుడు, చేసేటప్పుడు కులం అడ్డు రాదు. కానీ ఓటు వేసేటప్పుడు కులం ఎందుకు? సత్తా ఉంటే సీఎంలు అవుతారు తప్ప కులం పేరు చెప్పుకుంటే సీఎంలు కారు.
మీ చెల్లెలు షర్మిల ఏ కులస్థుడిని వివాహం చేసుకుంది జగన్ బ్రాహ్మణుడిని చేసుకుంది కదా అందరూ ఒకటేనన్న భావనతోనే ఆమె పెళ్లి చేసుకుంది. నువ్వు రెడ్ల పేరు చెప్పి తిరుగుతున్నావు. రెడ్లు అయితే కొమ్ములున్నాయా? కులాల పేరు, మతాల పేరు చెప్పుకుంటే సీఎంలు కారు. పదవులు రావు. అలా వచ్చేదే ఉంటే అంతా కులాల పేరు చెప్పుకొని రాజకీయాలు చేసేవారు. ఇప్పటికైనా అసలు విషయం గమనించి ప్రజలందరిని సమానంగా చూడడం నేర్చుకో.
ఇటివల వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా కులం పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారు. అనేక సభలల్లో కులం గురించి బహిరంగంగానే పవన్ మాట్లాడారు. వీరిద్దరు కుల రాజకీయాలు మానుకుంటే మంచిది. లేకుంటే ఇద్దరూ కూడా సంకనాకిపోతారు.” అని జెసి దివాకర్ రెడ్డి పవన్, జగన్ లపై నిప్పులు చెరిగారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జెసి దివాకర్ రెడ్డి మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. కులాల ప్రాతిపదికన జెసి మాట్లాడుతుండడంతో అంతా చర్చించుకుంటున్నారు. నిజంగానే జగన్ కేవలం ఒక కులం ప్రాతిపదికనే తన ప్రచారాన్ని సాగిస్తున్నారా, జెసి మాటల వెనుక ఉన్న అంతర్యం ఏమిటనేది చర్చనీయాంశమైంది.