వైసీపీ వర్గాల్లో కొత్త చర్చ… విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా జేపీ?

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీ రాజకీయాల్లో రసవత్తర చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఏ చిన్న అంశాన్ని వదులుకొనేందుకు సిద్దంగా లేనట్లు కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ తో నాటి కాలంలో సన్నిహిత సంబంధాలు ఉన్న వారికి ప్రత్యేకంగా గుర్తింపు ఇస్తున్నారు.

అవును.. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీ సీఎం ఏ విషయంలోనూ తగ్గడం లేదు. అందరినీ కలుపుకుపోతూ తాను నమ్ముకున్న పాజిటివ్ ఓటు బ్యాంకును మరింత మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కు సీఎం జగన్ అందరి సమక్షంలో ప్రత్యేకంగా గౌరవం ఇచ్చారు.

దీంతో… ఈ తాజా పరిణమం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. ఫలితంగా కొత్త అంచనాలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి జేపీకి ఛాన్స్ ఉందనే కామెంట్లు సైతం వినిపించడం మొదలయ్యాయి.

వివరాళ్లోకి వెళ్తే… లోక్ సత్తా అధినేత జేపీ తాజాగా విజయవాడలో ఒక కార్యక్రమంలో సీఎం జగన్ తో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆప్కాబ్‌ వజ్రోత్సవ వేడుకలకు హాజరైన సీఎం జగన్… ప్రముఖుల్లో ఆశీనులైన జేపీని తన వద్దకు తీసుకురావాల్సిందిగా మంత్రి జోగి రమేష్ కు సూచించారు. ఈ సమయంలో జేపీ వేదికపైకి రాగానే సీఎం జగన్ లేచి నిలబడి కరచాలనం చేసారు.

అనంతరం తన పక్కన సీట్లోనే కూర్చోబెట్టుకొని మాట్లాడారు. ఈ సమయంలో ఇద్దరూ కలిసి చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతుండటం.. సీఎం జగన్ తనదైన శైలిలో నవ్వుతూ వినటం ఆసక్తి కరంగా మారింది. కార్యక్రమం ముగిసిన తరువాత తిరిగి వెళ్లే సమయంలోనూ జేపీ వద్దకు వెళ్లి సీఎం మరోసారి సంభాషించారు.

దీంతో గతంలో ఎన్టీఆర్ వద్ద పని చేసి.. చంద్రబాబుతో సహా, నందమూరి కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్న జేపీ… వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తారా అనే చర్చ మొదలైంది. ఇందులో భాగంగా ఆయన అంగీకరిస్తే… విజయవాడ ఎంపీ సీటు కూడా జగన్ ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

మరి ఎన్నికల నాటీకి ఇలాంటి కార్యక్రమాలు, ట్విస్టులు, జలక్కులు… ఇంకెన్ని జరుగుతాయనేది వేచి చూడాలి. ఏది ఏమైనా… జేపీ వైసీపీ నుంచి పోటీ చేస్తే మాత్రం గెలవడం కన్ ఫాం అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాగా… తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తిగా లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ రాష్ట్ర ప్రజలకు సుపరిచయులే. 2009 ఎన్నికల్లో కుకట్ పల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయిన ఈయన… రాష్ట్ర విభజన తరువాత 2014 లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసారు.