జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’తో ప్రస్తుతం పొలిటికల్ స్టంట్లు చేస్తున్నారు. తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘వారాహి’ వాహనానికి పూజలు దాదాపుగా పూర్తయినట్లే. ముఖ్య పూజలు పూర్తయ్యాయ్.. వాటికి కొనసాగింపుగా చిన్నా చితకా పూజలు జరుగుతాయ్.
అయితే, పొత్తుల సంగతేంటి.? పోటీ చేసే నియోజకవర్గాల సంగతేంటి.? ఈ విషయమై జనసేన వర్గాల్లో ఒకింత గందరగోళ వాతావరణమే నెలకొంది. జనసేన అధినేత ఎక్కడ పోటీ చేస్తారో తెలిస్తే.. అక్కడ స్థానికంగా పార్టీని బలోపేతం చేసుకోవచ్చని జనసేనలో కొందరు ముఖ్య నేతలు భావిస్తున్నారు.
‘ఆ విషయం నాకు వదిలెయ్యండి..’ అంటూ తాజాగా, మంగళగిరిలో జనసేన అధినేత, పార్టీ ముఖ్య నేతలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారట. పోనీ, టీడీపీతో పొత్తు సంగతేంటి.? అదైనా చెప్పండి.. అనడిగితే, ‘దానికింకా సమయం వుంది..’ అని సెలవిచ్చారట జనసేనాని.
‘ఇప్పటికైతే మనం బీజేపీతో వున్నాం. ఆ బీజేపీతోనే ముందుకు వెళుతున్నాం. దానికి మించి, టీడీపీతో పొత్తు.. అనే ప్రచారానికి ఆస్కారమివ్వొద్దు..’ అని జనసేనాని, పార్టీ ముఖ్య నేతలకు తేల్చి చెప్పారట.
జనసేన నేతలేమో, ‘టీడీపీతో పొత్తు వుండదు’ అంటున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటున్నారు. దీనర్థమేంటో జనసేన నేతలకు అర్థం కావట్లేదాయె.!