తెలుగు రాజ్యం ప్రత్యేకం: వారాహి యాత్ర అప్ డేట్స్… తెరపైకి కీలక అంశాలు!

ఎంతోకాలం నుంచి జనసైనికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న జనసేన ప్రచార రథం “వారాహి” యాత్ర జూన్ నెల 14 నుంచి ప్రారంభమవ్వబోతోన్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర అన్నవరం నుంచి భీమవరం వరకూ సాగనుంది. గోదావరి జిల్లాల్లో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని చెబుతున్న జనసేన అధినేత పవన్… ఈ మేరకు తొలివిడత యాత్రను ఈ ప్రాంతంలోనే మొదలుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి.

ఏపీ పొలిటికల్ వ్యవస్థలో గోదావరి జిల్లాలు కీలక భూమిక పోషించడంతోపాటు.. సెంటిమెంట్ ను కూడా ప్రభావవంతంగా చూపిస్తుంటాయి. ఈ రెండు జిల్లాల్లో ప్రభావం చూపించగలిగితే అధికారంలోకి వస్తారనే ఒక చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తుంటుంది. ఇందులో భాగంగా… ఇప్పటికే ఉమ్మడి గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఇందులో భాగంగా ఇప్పటికే అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించడంతోపాటు.. కీలకమైన మహానాడును కూడా గోదావరి ఒడ్డునే నిర్వహించారు.

ఇదే సమయంలో పవన్ కూడా పంటనష్టపోయిన రైతులను పరామర్శించడానికి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. తాజాగా కీలకమైన వారాహి యాత్రను కూడా తూర్పు గోదావరి జిల్లా నుంచే ప్రారంభించి.. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ముగించనున్నారు.

ఇందులో భాగంగా… ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంతో మొదలుపెట్టి ఈసారి పవన్ పోటీచేయబోతున్నారంటూ కథనాలొస్తున్న పిఠాపురం నియోజకవర్గం మీదుగా… కాకినాడ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలతో తూర్పుగోదావరి యాత్రను పూర్తిచేస్తారు. అనంతరం అక్కడ నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకి ఎంటరై నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల మీదుగా భీమవరం చేరి అక్కడ యాత్ర ముగిస్తారు!

ఈ సమయంలో పవన్ కవర్ చేసే నియోజకవర్గాలపై కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఉదాహరణకు… పవన్ పర్యటించబోయే నియోజకవర్గాలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే… వాటిలో ఒక కీలకమైన విషయం వెలుగులోకి వస్తుంది. ఆ నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర లేకపోవడం ఒకటి కాగా… ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ ప్రభావం కూడా అతిస్వల్పంగా ఉండటం. అంటే… పొత్తులో భాగంగా పవన్ ఈ నియోజకవర్గాలనే కోరబోతున్నారా అనే సందేహం కూడా కలుగుతుంది.

ఈ నేపథ్యంలో ప్రత్తిపాడు విషయానికొస్తే… లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ లో ఈ నియోజకవర్గంలో లేదు. పైగా 2009 తరవాత ఈ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరలేదు. 2014 లోనూ 2019లోనూ ఇక్కడ ఫ్యాన్ గాలే వీచింది.

ఇక కాపు సామాజికవర్గం అధికంగా ఉండే పిఠాపురం నియోజకవర్గం విషయానికొస్తే… 1994 తరవాత ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థి ఎవరూ గెలిచింది లేదు. పైగా ఈసారి ఉత్తరాంధ్ర కంటే తూర్పుగోదావరే సేఫ్ అని భావిస్తున్న పవన్… పిఠాపురాన్ని ఎంచుకోబోతున్నారని కథనాలొస్తున్నాయి!

ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే… తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం అభ్యర్ధి లేని పరిస్థితి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి 2021లో పార్టీకి రాజినామా చేశారు. పైగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత శత్రువుల లిస్ట్ లో ఉన్న వైకాపా నేతల్లో ఒకరైన కన్నబాబు ఈ నియోజకవర్గం నుంచి వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో పవన్ ఈ నియోజకవర్గంపై మనసుపడ్డారని, ఇక్కడ జనసేన జెండా ఎగరెయ్యాలని భావ్సితున్నారని గతంలో కథనాలొచ్చాయి.

ఇక కాకినాడ అర్బన్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే… ఈ సీటులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉనికి ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా ఉంది. ఫలితంగా సీనియర్ రాజకీయ నాయకుడు మద్దతు లేకుండా సైకిల్ నడవలేని పరిస్థితి. అయితే ముత్తా గోపాలకృష్ణ కుమారుడు ముత్తా శశిధర్ 2018లో జనసేన పార్టీలోకి చేరిపోయారు కాబట్టి ఇది కూడా పొత్తులో భాగంగా జనసేన ఖాతాలోకే!

ఇక ముమ్మిడివరం వెళ్తే… ఈ నియోజకవర్గం కూడా లోకేష్ పాదయాత్రలో కవరవ్వని కాన్స్టెన్సీ గానే ఉంది. 2004 తరవాత ఒక్కసారి మాత్రమే ఇక్కడ తెలుగుదేశం గెలిచింది. స్వర్గీయ జీఎంసీ బాలయోగి సమయంలో టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం అనంతర పరిణామాలతో సైకిల్ కి దూరమయ్యింది!

ఇక కోనసీమలో కీలకమైన అమలాపురం నియోజకవర్గాన్ని తీసుకుంటే… ఈ నియోజకవర్గం కూడా లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ లో లేకపోవడం గమనార్హం. ఇక్కడ టీడీపీకి ఐతాబత్తుల ఆనందరావు రూపంలో అభ్యర్థి ఉన్నప్పటికీ… మంత్రి, సీనియర్ పొలిటీషియన్ పినిపే విశ్వరూప్ ని తట్టుకుని నిలబడం సాధ్యం కాదనే మాటలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఇది జనసేన ఖాతాలోనే అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

ఇక పి.గన్నవరం నియోజకవర్గాన్ని తీసుకుంటే… ఈ నియోజకవర్గంలో కూడా చినబాబు పాదయాత్ర షెడ్యూల్ లేదని తెలుస్తుంది. ఈ నియోజకవర్గంపై కూడా సైకిల్ కి ఆశలు లేవు. అయితే రాజోలు మాజీ టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాజీ మంత్రిగా యాక్టివ్ గా ఉన్నప్పటికీ కేడర్ లో ఆ ఉత్సాహం కనిపించడం లేదనే కామెంట్లు బలంగా ఉన్నాయి!

ఇక గడిచిన ఎన్నికల్లో జనసేనకు ఊపిరి పోసి రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన రాజోలు నియోజకవర్గంలో కూడా లోకేష్ పాదయాత్ర లేదు. పైగా ఇక్కడ టీడీపీకి నాయకత్వమే లేని పరిస్థితి. ఒకప్పుడు అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన అల్లూరి పెదబాబు కీలకంగా పార్టీని నడిపించినా… అనంతర కాలంలో ఆ మెరుపు మిస్సైపోయింది! పైగా పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని జనసేన వదులుకునే ప్రసక్తే ఉండకపోవచ్చు!

ఇదే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం విషయానికొస్తే… ఏపీ చీఫ్ విప్ ప్రసాద రాజు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉండగా… గడిచిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ 19శాతం ఓటు షేర్ తో మూడో ప్లేస్ లో నిలవగా… జనసేన సుమారు 36% ఓటు బ్యాంక్ సాధించింది!

ఇక పవన్ యాత్ర భీమవరంలోకి ఎంటరవ్వబోయే ముందున్న మరో కీలక నియోజకవర్గం పాలకొల్లు. ఈ నియోజకవర్గం 2014, 2019లో వరుసగా టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు గెలిచినప్పటికీ… ప్రస్తుతం ఆయనపై స్థానికంగా వ్యతిరేకత బాగా పెరిగిందని అంటున్నారు! పైగా జనసేనకు ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో… లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ లో ఈ నియోజకవర్గం పేరు కూడా లేదని సమాచారం.

ఇక పవన్ యాత్రలో చివరి నియోజకవర్గం అయిన భీమవరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కీలక నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ మూడో స్థానానికి పరిమితమైపోయిన పరిస్థితి. ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్… 32శాతం ఓటు షేర్ సాధించి ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గడిచిన ఎన్నికల్లో కూడా గాజువాక తో పాటు ఈ భీమవరంలో కూడా టీడీపీ అధినేత ప్రచారం చేయలేదు! అందుకు కృతజ్ఞతగా… కుప్పం – మంగళగిరి లలో పవన్ కళ్యాణ్ పోటీ పెట్టని సంగతి తెలిసిందే!

దీంతో చంద్రబాబు సూచనల మేరకే పవన్ సెలక్టివ్ గా కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని.. ఆ నియోజకవర్గాల్లో వారాహి యాత్రను జరపబోతున్నారని తెలుస్తుంది. అంటే… గోదావరి జిల్లాల్లో ఈ నియోజకవర్గాలనే పొత్తులో భాగంగా బాబు.. పవన్ కి ఇస్తున్నారా అనే చర్చ తెరపైకి వస్తోంది. దీంతో మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న నేతలు… వాస్తవంలోకి రావాలనే సూచనలు పెరగబోతున్నాయన్నమాట.