ఆ ముప్ఫయ్ ఐదు సీట్లపై జనసేనాని పట్టు.!

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ముప్ఫయ్ ఐదు సీట్ల విషయమై జనసేన అధినేత గట్టిగా పట్టుబడుతున్నారట.! ఆ ముప్ఫయ్ ఐదు సీట్లకు ప్రత్యామ్నాయం లేదనీ, వాటికి అదనంగా మరో పదిహేను నుంచి ఇరవై వరకు సీట్లను తమకు టీడీపీ పొత్తులో భాగంగా కేటాయించాల్సిందేనని జనసేనాని స్పష్టం చేస్తున్నారట.

ఇంతకీ, ఆ ముప్ఫయ్ ఐదు నియోజకవర్గాల సంగతేంటి.? అంటే, వీటిల్లో మెజార్టీ నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాల్లోనే వున్నాయట. అందులో ఒకటి జనసేన అధినేత పోటీ చేయబోయే నియోజకవర్గమని అంటున్నారు.

భీమవరం నుంచే జనసేనాని మళ్ళీ పోటీ చేస్తారా.? పాలకొల్లుని ట్రై చేస్తారా.? కాకినాడ సంగతేంటి.? ఇలా చాలా రకాల ప్రశ్నలున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్నీ జనసేన కోరుకుంటోంది. ‘ప్రస్తుతానికి పొత్తుల, పంపకాల.. వీటిపై చర్చలు జరగలేదు’ అని జనసేన, టీడీపీ పైకి చెబుతున్నా, తెరవెనుకాల జరగాల్సిన వ్యవహారాలు జరిగిపోతున్నాయి.

సుందరపు విజయ్ కుమార్, పోతిన మహేశ్, కిరణ్ రాయల్.. ఇలా జనసేనలో చాలా యాక్టివ్‌గా వున్న ఓ నలభై మంది వరకు కీలక నేతల సీట్ల విషయమై జనసేనాని ఓ ప్రతిపాదన, టీడీపీ అధినేత ముందుంచారట.

‘ఎట్టి పరిస్థితుల్లోనూ ముప్ఫయ్‌కి పైగానే సీట్లు గెలవబోతున్నాం. కాలం కలిసొస్తే, గెలిచే సీట్ల సంఖ్య యాభై పైనే వుంటుంది..’ అని జనసేనాని ఇటీవల తనకు అందిన ఓ నివేదిక ఆధారంగా పార్టీ ముఖ్య నేతల్లో ఉత్సాహం నింపుతున్నారట. జనసేనాని సరదా బాగానే వుంది. కానీ, బాబుగారి వ్యూహాలకు జనసేనానికి మైండ్ బ్లాంక్ కాకుండా వుంటుందా.?