రాజకీయ నాయకులూ మనుషులే.! వాళ్ళకీ అనారోగ్య సమస్యలుంటాయ్. పైగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ నటుడాయె.. ఆయన ఇంకాస్త సున్నితంగా వుంటారు మరి.! జనంలోకి పవన్ కళ్యాణ్ వెళితే, అభిమానులే కుమ్మి పడేస్తున్నారు.
‘మీ అభిమానం వల్ల నేను గాయాల పాలవ్వాల్సి వస్తోంది.. నా విషయంలో కొంత జాగ్రత్తగా వుండండి..’ అంటూ అభిమానుల్ని పదే పదే బతిమాలుకోవాల్సి వస్తోంది పవన్ కళ్యాణ్‌కి. అయినా, అభిమానులు ‘తగ్గేదే లే’ అంటున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనాని ఇటీవల పర్యటించారు. జనసేన కౌలు రైతు భరోజా, జనసేన – జనవాణి కార్యక్రమాల నిమిత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనాని పర్యటించడం, ఈ క్రమంలో ఒకింత ఆయన అభిమానుల అతి ఉత్సాహంతో ఇబ్బంది పడటం తెలిసిన విషయాలే.
భారీ వర్షాలు, వరదల సీజన్ కావడంతో.. పరిస్థితి ఇంకాస్త గందరగోళంగా తయారైంది. ఈ క్రమంలోనే జనసేనాని ఒకింత అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం జనసేనాని వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారంటోంది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఆయనకు వ్యక్తిగత సిబ్బందిగా పనిచేస్తున్నవారు, పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు అనారోగ్యం బారిన పడ్డారు.
దాంతో, ఈ నెల 24న జరగాల్సిన జనవాణి కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెలాఖరున అంటే, జులై 31న జనవాణి కార్యక్రమం జరుగుతుందనీ, ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారనీ జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
అనారోగ్యంతో వున్నప్పుడు, పవన్ కళ్యాణ్‌కి బదులుగా నాగబాబుని పంపడమో, నాదెండ్ల మనోహర్ లేదా, ఇతర నాయకుల్నైనా రంగంలోకి దించి, జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించొచ్చు కదా.?