వైసీపీపై విమర్శలు.! తెలంగాణకు మద్దతుగా నిలిచిన జనసేనాని.!

ప్యాకేజీ విమర్శలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుస్సా అవుతుంటారు. చెప్పు కూడా తీసి రాజకీయ ప్రత్యర్థుల్ని హెచ్చరించడం చూశాం. కానీ, ప్యాకేజీ విమర్శలకు ఆస్కారం కల్పించేదే పవన్ కళ్యాణ్ చర్యలు.!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ వెయ్యి కోట్ల ప్యాకేజీని జనసేన అధినేతకు ఆఫర్ చేశారన్నది ఆ మధ్య టీడీపీ అను‘కుల’ మీడియా తెరపైకి తెచ్చిన అంశం. ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ఈ పైత్యాన్ని ప్రదర్శించారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఒకింత గుస్సా అయ్యారు.

రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే.! ఇప్పుడేమో, ఆ ప్యాకేజీ విమర్శలు నిజమే అన్నట్లు, తెలంగాణకు బాసటగా నిలిచారు జనసేన అధినేత. ‘తెలంగాణ నాయకుల్ని తిట్టుకోండి.. తెలంగాణ ప్రజల్ని మాత్రం తిట్టొద్దు..’ అని జనసేనాని వైసీపీ నేతలపై మండిపడ్డారు. తక్షణం తెలంగాణ ప్రజలకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసేశారు.

‘గతంలో ఏపీ ప్రజలను తెలంగాణ నేతలు తిట్టినప్పుడూ పవన్ కళ్యాణ్ ఇలాగే స్పందించారు..’ అన్నది జనసేన వెర్షన్. కానీ, రాజకీయాల్లో నాయకుల మాటల్ని చాలా తేలిగ్గా ‘ట్విస్ట్’ చేస్తుంటారు. ట్రోలింగ్ చేస్తుంటారు కూడా. పవన్ కళ్యాణ్ విషయంలోనూ అదే జరిగింది.

తెలంగాణ తరఫున వకాల్తా పుచ్చుకోవడానికి బీఆర్ఎస్ వుంది. తెలంగాణ బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలూ వున్నారు. పవన్ కళ్యాణ్‌కే ఎందుకీ తొందర.? ఇవే ఇలాంటివే, ప్యాకేజీ విమర్శలకు బలాన్నిస్తాయి.