“వీర”మహిళలు, జన”సైనికులు”… పవన్ చెప్పిన కొత్త నిర్వచనం ఇదే!

“మారావనుకున్న ప్రతిసారీ.. మరింత పాతాళానికి దిగిపోతున్నావు..” అనే డైలాగ్ గుర్తుకొస్తుంది తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే…! జనసేన కార్యకర్తలు అంటే… పూర్తిగా తన కంట్రోల్ లో ఉండే వ్యక్తుల్లా, తన ఆధీనంలో ఉండే శక్తుల్లా ఉండాలే తప్ప… ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి స్వాతంత్రం ఉండదు.. ఉండకూడదు.. ఆత్మాభిమానం, పౌరుషం అసలే ఉండకూడదు… అన్నట్లుగా ఆలోచిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… అని అంటున్నారు విశ్లేషకులు.

తాజాగా జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులకు ట్విట్టర్ వేదికగా ఒక లేఖ విడుదల చేశారు పవన్ కల్యాణ్. ఆ లేఖ ఎందుకు విడుదల చేశారు.. ఎవరిని ఉద్దేశించి చేశారు అన్నది చాలా స్పష్టంగా తెలుస్తున్నా… ఎవరి పేర్లూ నేరుగా ప్రస్థావించకపోవడం.. వీలైనంత మెలికలు తిప్పుతూ రాయడం కొసమెరుపు!

ప్రస్తుతం మైత్రీ మూవీస్ సంస్థలో వైసీపీ నేత, మాజీ మంత్రి పెట్టుబడులు పెట్టారంటూ జనసేన వైజాగ్ కార్పొరేటర్ మూర్తి యాదవ్ సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే! అయితే… ఈ విషయాలపై పవన్ ఇప్పటి వరకూ స్పందించలేదు. కానీ… బాలినేని మాత్రం సీరియస్ గా స్పందించారు. తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు కానీ మైత్రీ మూవీస్ తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. తనకు దిల్ రాజు తోనే మంచి స్నేహం ఉందని.. కాని తాను పెట్టలేదని స్పష్టం చేశారు. ఇంతకు మించి విమర్శలు చేస్తే… అన్నస్థాయిలో ఫైనల్ టచ్ ఇచ్చారు!

అలా బాలినేని రియాక్ట్ అయ్యే సరికి విమర్శలు చేసిన జనసేన నేతలు కానీ… ఆ విమర్శలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి అచ్చేసిన పత్రికలు కానీ… మళ్లీ కనిపించలేదు.. స్పందించలేదు! దీంతో… విషయం పూర్తిగా అర్ధమైన పవన్… “ఇకపై ఎవరైనా.. ఎవరిపై అయినా.. ఎలాంటి విమర్శలు చేయాలన్నా… ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల దృష్టికి తీసుకురండి. వారి సూచనలు, సలహాల మేరకు మాత్రమే మీరు మాట్లాడండి” అని సుతిమెత్తగా సూచించారు!

అనంతరం.. మరింత జాగ్రత్త పడిన పవన్… టీడీపీ నేతలెవరైనా మనల్ని తిడితే… ఎవరూ తెలుగుదేశం పార్టీని మాత్రం తిట్టకండి అని పరోక్షంగా సూచించారు! అవును… “మనతో సయోధ్యగా ఉన్న రాజకీయ పక్షాలలో చిన్నా చితకా నాయకులు మనపై ఏమైనా విమర్శలు చేస్తే… ఆ విమర్శలు ఆ నాయకుని వ్యక్తిగత విమర్శలుగా భావించండి. వాటిని ఆయా పార్టీలకు ఆపాదించొద్దు” అని పవన్ తన లేఖలో పేర్కొన్నారు.

దీంతో… “మిత్రపక్షం అని చెబుతున్న బీజేపీ నేతలు కానీ… పొత్తుల కోసం ప్రాకులాడుతున్న టీడీపీ నేతలు కానీ… ఎవరైనా ఏమైనా అంటే… తుడుచుకుని పోవాలే తప్ప… ఆ పార్టీలపై విమర్శలు చేయకూడదు” అని పవన్ పరోక్షంగా చెప్పారని కామెంట్ చేస్తున్నారు విశ్లేషకులు!

ఇదే అదనుగా… “పవన్ ఏదో మారరు… మైకులముందు కేకలేసినంత పౌరుషం నిజజీవితంలో ఆయన కలిగిలేరు… తనవారు కూడా కలిగి ఉండకూడదని భావిస్తున్నారు… తనను నమ్ముకుని రాజకీయ చేసేవారు అన్నీ వదిలేసి ముందుకు కదలాలని భావిస్తారు… ఆ అన్నీలో పౌరుషం, ఆత్మాభిమానం కూడా ఉంటాయి… అలాంటి వారినే ‘వీర’ మహిళలు, జన’సైనికులు’ అంటారు…” అని వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు రాజకీయ ప్రత్యర్థులు!