తప్పు మీద తప్పు: ముద్రగడపైకి పవన్ అనుచరులు!

తెలిసి చేస్తున్నాడో.. మైకంలో చేస్తున్నాడో.. లేక, రాజకీయలంటే సరైన అవగాహన లేక చేస్తున్నాడో తెలియదు కానీ పార్టీకి ఊపొస్తుంది అనుకున్న దశలో తప్పు మీద తప్పు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా ముద్రగడపై కామెంట్స్ చేసిన ఆయన.. ఈ రోజు తన అనుచరులను ఆయనపైకి వదులుతున్నారు!

ఎవరు అవునన్నా కాదన్నా పవన్ బలం తన సామాజికవర్గంలోని కొంతమంది జనం! సినిమాల్లో పవన్ ని అభిమానించే యువత ఎక్కువగానే ఉండొచ్చేమో కానీ.. రాజకీయాల్లో అది చాలా తక్కువ అనేది విశ్లేషకుల మాట. పవన్ పరిపూర్ణమైన రాజకీయ నాయకుడు కానక్కరలేదు కానీ… కనీసం అవగాహన లేని నేతగా మిగిలిపోతున్నాడనేది తాజా కామెంట్ల సారాంశం.

కారణం… వైసీపీ నేతలను పవన్ విమర్శించారంటే అందులో అర్ధం ఉంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా.. కేవలం వైసీపీని మాత్రమే పవన్ విమర్శించగలరు. ఇక ఆ విమర్శలు ఏస్థాయిలో ఉండాలి.. ఎలా ఉండాలి అనేది పూర్తిగా పవన్ సంస్కారంపై ఆధారపడి ఉంటుంది. కానీ… పవన్ కంటే ముందునుంచీ.. పవన్ నిక్కర్లు తొడుక్కునే వయసునుంచీ కాపు సంక్షేమం కోసం ఉద్యమాలు చేస్తున్న నేతపై కూడా పవన్ విమర్శలు చేశారు.

దీన్నే మైకంతో కూడిన చర్యగా అభివర్ణిస్తున్నారు కాపు సామాజిక వర్గ ప్రజలు! ఇప్పుడెదో సినిమాల్లో కాస్త పేరొచ్చి, ప్యాకేజీలో నాలుగు డబ్బులొచ్చి, మీటింగులకు నలుగురు మనుషులు వస్తున్నప్పటికి.. కన్నూ మిన్నూ కానకుండా, వెనకా ముందూ చూసుకోకుండా, సుతా మొదలూ తెలియకుండా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదంటూ సూచిస్తున్నారు.

ఇదే సమయంలో పవన్ వ్యాఖ్యలపై ముద్రగడ స్పందించారు. పవన్ ను సుతిమెత్తగా కడిగిపారేశారు. ఘాటుగా ప్రశ్నలు వేస్తూ.. స్మూత్ గా సూచనలు కూడా చేశారు. తన సమర్ధతను చెబుతూ.. పవన్ అసమర్ధతను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ… పవన్ లో ఉన్న పరిపూర్ణ అజ్ఞానాన్ని బహిర్గతం చేసే పనికి పూనుకున్నారు.

ఇలా ముద్రగడ లేఖాస్త్రం సంధించడంతో… పవన్ కి, ఆయన మాటలకు ఈలలు వేసే వారికీ కాస్త కళ్లు తెరుచుకుని ఉంటాయని అంతా భావించారు. అయితే పవన్ & కో మాత్రం ఈ విషయంలో తగ్గడం లేదు. ముద్రగడపై మళ్లీ ఎదురుదాడికి దిగడం మొదలుపెట్టారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే… గోదావరి జిల్లాల్లోని కాపు సామాజికవర్గ నేతలు, కుల సంఘాల నాయకులు, ప్రజానికం ముద్రగడకు బాసటగా నిలబడుతుండగా… జనసేన నాయకులతో కలిపి టీడీపీలోని కాపు నేతలు మాత్రమే పవన్ కు అండగా నిలబడుతున్నారు. దీంతో… ముద్రగడను కాదని పవన్ కాపు సామాజికవర్గంలో సాధించేది స్వల్పం అంటూ కామెంట్లు పెడుతున్నారు విశ్లేషకులు.