ముహూర్తం ఫిక్స్!… బాబు ముందు జనసేన బలప్రదర్శన!

టీడీపీ – జనసేనల సీట్ల సర్ధుబాట్ల వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదని తెలుస్తుంది. దీంతో… వీరి అభ్యర్థుల తొలి జాబితా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. మరోపక్క బీజేపీ కోసం వేచి చూసే దోరణిలో కూడా ఉన్నారని తెలుస్తుంది. అభ్యర్థుల నిర్ణయం ఆలస్యం అవ్వడానికి అదికూడా ఒక కారణం అని తెలుస్తుంది. మరోపక్క టిక్కెట్ల నిర్ణయం ఆలస్యం అవుతుండటంతో రెండు పార్టీల ఆశావహులలో అసహనం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదే సమయంలో చివరి వరకూ ఎదురు చూసిన అనంతరం… చావు కబురు చల్లగా చెబితే అప్పుడు అసంతృప్తులను బుజ్జగించడం తలకు మించిన భారంగ పరిణమించే ప్రమాధం లేకపోలేదని అంటున్నారు. మరోపక్క ఈ అసంతృప్తులు రెబల్స్ గా మారితే మొదటికే మోసం వస్తుందని చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే… జనసేనకు కేటాయించే సీట్ల విషయంలో టీడీపీ ఆలోచన ఇప్పటికీ 20 – 25 మధ్యే ఉందని అంటున్నారు.

అయితే ఇందుకు జనసేన ససేమిరా అంటుందని సమాచారం. దీంతో జనసేన నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఒకపక్క… జనసేనతో సంబంధం లేకుండా బాబు దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. “రా.. కదలి రా” అంటూ జిల్లాల టూర్లకు బాబు తెరలేపారు. ఇందులో భాగంగా కీలక నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో… జనసేన కూడా తమ బలం ఏమిటో చంద్రబాబుకు చూపించాలని నిర్ణయించుకుందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా… జనసేన పార్టీలోని కీలక కాపు నేతలు తొందరలో సమావేశం అయి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు అని తెలుస్తుంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా వాడుకోవాలని.. రాజ్యాధికారం తమకు తప్పనిసరిగా కావాలని బలంగా నిర్ణయించుకుని, ఆ విషయాన్ని సమాజంలోకి పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం టీడీపీ తమకు కేటాయించే సీట్లను సైతం ప్రభావితం చేయాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లుగా ఉన్న జనసేన నేతలు… కాపులతో ఒక భారీ బహిరంగ సభను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని.. తద్వారా టీడీపీకి బలమైన సంకేతాలు పంపాలని.. జనసేనను ఆటలో అరటిపండులా చూడొద్దని.. వారికి కనీసం 50 సీట్లకు తక్కువ కాకుండా ఇచ్చేలా ఆలోచన చేయాలని చేతలతో చెప్పేలా.. బలప్రదర్శనకు ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారని అంటున్నారు.

ఈ కార్యక్రమానికి జనసేనలోని కాపునేతలతో పాటు.. ఏపార్టీకీ చెందకుండా న్యూట్రల్ గా ఉన్న కాపు సామాజికవర్గంలోని కీలకమైన వ్యక్తులను ఆహ్వానించాలని.. ఫలితంగా కాపు యువతకు దిశా నిర్ధేశం చేయడంతోపాటు.. టీడీపీకి తమ బలాన్ని తెలియచెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముందే ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

మరి ఆ సభను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు.. ఎక్కడ ఏర్పాటు చేస్తారు.. ఆ సభ అనంతరం చంద్రబాబులో ఏమేరకు మార్పు వచ్చే అవకాశం ఉంది.. మొదలైన విషయాలపై క్లారిటీ రావాలంటే కాసిన్ని రోజులు ఎదురు చూడాల్సిందే!