కన్నా పార్టీ మార్పుపై ‘అతి జాగ్రత్త’గా స్పందించిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి పెద్ద కష్టమే వచ్చి పడింది. బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ.. త్వరలో జనసేనలోకి జంప్ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా జనసేన అధినేత స్పందించక తప్పలేదు. మీడియా ఆయన్ని కన్నా పార్టీ మార్పుపై ప్రశ్నిస్తే.. తనదైన స్టయిల్లో స్పందించారు.

‘ఇప్పటికైతే బీజేపీతో కలిసే వున్నాం. కాబట్టి, పార్టీ మార్పు గురించి నేనేమీ మాట్లాడలేను. బయట ఏదో ప్రచారం జరుగుతోంది. అది నిజమని నేను అనుకోవడంలేదు. ఆయన మీద గౌరవం వుంది. ఆయన్నే ఈ విషయమ్మీద అడగండి..’ అనేశారు జనసేనాని. అయినా, మిత్రపక్షాల్లో ఈ జంపింగ్ జపాంగులేంటి.? కన్నా లక్ష్మినారాయణ గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత.

ఇప్పుడేమో కన్నా లక్ష్మినారాయణ, జనసేన అధినేతను కాపాడుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘బీజేపీ తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగ్గా లేదు’ అని కూడా అంటున్నారు. దీని భావమేమి.? అంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రంగా స్పందించాల్సి వచ్చింది. కాగా, పార్టీ మార్పుపై కన్నా నిర్ణయం తీసేసుకున్నారనీ, ఈ విషయమై కొన్నాళ్ళ క్రితమే జనసేనానితో స్పష్టత కూడా తీసుకున్నారనీ ప్రచారం జరుగుతోంది. జనసేనాని మాత్రం ‘బయట ఏవేవో ప్రచారాలు జరుగుతాయ్..’ అనేసి చేతులు దులుపుకున్నారు.