‘మొత్తంగా 175 సీట్లలో పోటీ చేయడానికే సిద్ధంగా వున్నాం. అంతిమంగా మా అధినేత పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి…’ ఇది జనసేన పార్టీకి చెందిన ఓ కీలక నేత, ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల సారాంశం. ‘రాజకీయాల్లో గెలుపోటములు శాశ్వతం కాదు. అంతిమంగా ప్రజలకోసం ఏం చేశామన్నదే ముఖ్యం. అధికారంలో లేకపోయినా, జనసేన పార్టీ తరఫున అవసరంలో వున్నవారికి ఆర్థిక సాయం కావొచ్చు, ప్రజా సమస్యలపై పోరాటంలో విషయం కావొచ్చు.. మేం ఎక్కడా తగ్గలేదు.. వెనుకడుగు వేయలేదు’ అని జనసేన పార్టీ చెబుతోంది.
నిజమే, జనసేన పార్టీ అసలు ఇలా, ఈ స్థాయిలో నిలబడటమంటే చిన్న విషయం కాదు. కానీ, ఇప్పుడున్న రాజకీయాల్లో రాజకీయ పార్టీలకు నాయకుల అవసరం ఎంతైనా వుంది. జనసేన పార్టీకి, 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులనదగ్గ నాయకులున్నారా.? అంతెందుకు, జనసేన పార్టీ సొంతంగా ఎన్నికల బరిలో దిగుతుందా.? లేదంటే, టీడీపీ సాయం కోరాల్సిందేనా.? అన్నదానిపై ఇప్పటిదాకా జనసేన స్పష్టతనివ్వడంలేదు. మిత్రపక్షం బీజేపీతో జనసేన కలిసి వుందో లేదో తెలియని గందరగోళం ఆ పార్టీలో వుంది.
వచ్చే ఎన్నికల్లో తాము జనసేన జెండాతోపాటు, ఇంకే ఇతర పార్టీ జెండా పట్టుకోవాలో తెలియక గింజుకుంటున్నారు జనసైనికులు. పొత్తులు తప్పనిసరైతే, కొన్ని చాలా నియోజకవర్గాల్లో జనసైనికులు, వేరే పార్టీల జెండాలు పట్టుకోవాల్సి వస్తోంది. జనసేనాని ధైర్యంగానే వున్నారు.. జనసైనికులే, ఏ జెండా పట్టుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
