‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’ అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘జనసేన పార్టీకి కూడా ఓ అవకాశం ఇచ్చి చూడండి.. మేం మెరుగైన పాలన అందిస్తాం. సమర్థులైన అధికారులతో అత్యంత సమర్థవంతమైన పాలన చేపడతాం..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవ వేళ పార్టీ కార్యాయలంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
‘పదవుల కోసం నేను పాకులాడను.. పదవులే నా కోసం రావాలి..’ అని ఓ వైపు చెబుతూనే, ‘నాకు ఓటెయ్యండని అడగాలంటే మొహమాటంగా వుంటుంది..’ అని చెబుతూనే, ‘ఒకే ఒక్క ఛాన్స్..’ అంటూ జనాన్ని కోరుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇదే, ఈ కన్‌ఫ్యూజన్ వల్లనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోనూ చులకనవుతున్నారన్నది నిర్వివాదాంశం.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొలిటికల్ వాక్యూమ్ వుంది.. ప్రతిపక్షానికి సంబంధించి. అధికార పక్షం బంపర్ మెజార్టీతో వున్నప్పుడు, విపక్షాలు మరింత యాక్టివ్‌గా వుండాలి.. ప్రజలకు చేరువయ్యేందుకు, రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నించాలి.
టీడీపీ అంటేనే యాగీ తప్ప ఇంకేమీ లేకుండా పోయింది. టీడీపీతో పోల్చితే, జనసేనలో కొంత చిత్తశుద్ధి వున్నమాట వాస్తవం. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ‘కన్సిస్టెన్సీ’ లేకుండా పోయింది. ఒక్క ఛాన్స్.. అంటూ జగన్ అడిగారు.. ప్రజలిచ్చారు.. నాకెందుకు ఇవ్వరు.? అన్న భావనలో పవన్ కళ్యాణ్ వుంటే ఎలా.?
పవన్ కళ్యాణ్ కూడా ఒక్క ఛాన్స్ అడగడంలో తప్పు లేదు. కానీ, ప్రజల్లోకి వైసీపీ స్థాయిలో అంత బలంగా జనసేన వెళ్ళాలి కదా.?