జనసేన ఓటు బ్యాంకు 20 – 25 మధ్య వుందా.?

2019 ఎన్నికల్లో జనసేన ఓటు బ్యాంకు పది శాతం కూడా కనిపించలేదు. మరి, జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాల్ని సాధించనుంది.? 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు గనుక, 2024 ఎన్నికల్లోనూ అదే ఫలితం రిపీట్ అవుతుందని అధికార వైసీపీ చెబుతోంది.

చూచాయిగా టీడీపీలోనూ ఇదే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, జనసేనతో రాజకీయ అవసరం వుంది గనుక, జనసేన అధినేతనూ తాము గెలిపించుకుంటామని టీడీపీలో కొందరు నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ‘మాతో జనసేన కలిస్తే, జనసేన పార్టీకి పది నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం వుంటుంది’ అన్నది టీడీపీ భావన.

అయితే, జనసేన మాత్రం, తమతో టీడీపీ పొత్తు పెట్టుకుంటేనే, టీడీపీ గెలుపు గురించి ఆలోచించడానికి ఆస్కారం వుంటుందనీ, తమతో కలిసి అధికారం పంచుకోవడం తప్ప టీడీపీకి ఇంకో ఆప్షన్ లేదన్నది జనసేన వాదన. ఇంతకీ, జనసేన పార్టీకి 2024 ఎన్నికల్లో ఎంత శాతం ఓటు బ్యాంకు లభించే అవకాశముంది.? టీడీపీతోపాటు వైసీపీ కూడా చేయించుకుంటున్న అనేక సొంత సర్వేల్లో జనసేన ఓటు బ్యాంకు బలంగానే పెరిగిందనే విషయం బయటపడుతోంది. జనసేన పార్టీకి వైసీపీ అంతర్గత సర్వేల్లో 18 నుంచి 20 శాతం వరకు ఓటు బ్యాంకు కనిపిస్తోందిట. అదే టీడీపీకి అయితే 20 నుంచొ 25 శాతంగా అది గోచరిస్తోందట.

రెండిటినీ పరిగణనలోకి తీసుకుంటే 22 శాతానికి అటూ ఇటూగా జనసేనకు ఓటు బ్యాంకు లభించే అవకాశం వుందన్నమాట. అదే నిజమైతే, ఖచ్చితంగా జనసేన పార్టీ 2024 ఎన్నికల్ని శాసిస్తుంది. ఇక్కడే వైసీపీ భయం స్పష్టంగా కనిపిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. అయితే, అంత సీన్ జనసేనకు లేదని వైసీపీ నేతలంటున్నారు.