పవన్ కు బిగ్ అలర్ట్… గోదావరి జిల్లాల్లో జనసేన ముందున్న సవాళ్లు ఇవే..!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సెలక్టివ్ నియోజకవర్గాలతోపాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో వారాహి యాత్ర ముగిసిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ నెల 9న ఏలూరు నుంచి వారాహి యాత్ర రెండో విడత ప్రారంభం కాబోతొంది. ఈ సమయంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ముందున్న సవాళ్లు కీలకంగా చర్చకు వస్తున్నాయి.

అవును… గోదావరి జిల్లాల్లో వైసిపికి ఒక్క సీటు కూడా రానివ్వను అని లక్ష్యంగా పెట్టుకున్న పవన్ చేతల్లో ఆ దిశగా ఏ మేరకు అడుగులు వేస్తున్నారు… అదే సమయంలో వైసీపీ చేస్తోన్న అతి కీలకమైన విమర్శకు ఎలా సమాధానం చెప్పబోతున్నారు అనేది కీలకంగా మారింది.

కారణం… చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మ, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడానికే పవన్ పోరాటం పేరుచెప్పి పడున్న ఆరాటం అని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు పవన్ సమాధానం చెప్పలేనంతవరకూ ఆయనకు జనాల్లో క్రెడిబిలిటీ సన్నగిల్లే ప్రమాధం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కు ప్రత్యేకంగా బలమున్న కాపు సామాజికవర్గ ఓట్లపై జనసేన పూర్తిగా ఆధారపడిందన్నా అతిశయోక్తి కాదు. అలా అని ఆ ఒక్క వర్గం ఓట్లే పవన్ కు సరిపోతాయా అంటే… ఆ సమాధానం జనసేన నేతలకందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో అన్ని వర్గాలను ఒప్పిస్తూ, అన్ని సమాజివర్గాలనూ కలుపుకుంటూ జనసేన ఎమ్మెల్యే అభ్య్ర్థులు ఇప్పటినుంచే ముందుకు కదలాలి. కానీ పవన్ ఆ దిశగా అడుగు వేయడం లేదు.

ఇప్పటికే ఆయన ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను ప్రకటించేసి… వారిను కూడా వారాహి వాహనం ఎక్కి పవన్ ప్రసగించాలి. ఆ అభ్యర్థిని బలపరచమని ప్రజలను వేడుకోవాలి. కానీ పవన్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. మరో సారి వారాహి యాత్ర ఉంటుంది.. అప్పుడు అభ్యర్థులను ప్రకటించి ఆ వాహనం ఎక్కించుకుంటారు అని అనుకుంటే అది జరిగే పని కాదనేది బలంగా వినిపిస్తున్న మాట.

ఎన్నికలు సమీపించేస్తున్న సమయంలో పవన్ మరోసారి వారాహి యాత్ర చేపట్టడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో… ఇప్పటికైనా జనసేన నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులను ప్రకటించడం అత్యంత అత్యవసరం అనేది విశ్లేషకులు చెబుతున్నమాట.

ఇదే సమయంలో పవన్ తనతో కలిసి వచ్చే జనసైనికులతో ముచ్చటించేసి మీటింగులు చేపడుతున్నారే తప్ప స్థానిక నేతలను ఆకర్శించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇదే సమయంలో ఆలు లేదు సూలు లేదు అన్నట్లుగా… పార్టీలో అప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత పోరు మొదలైపోయింది. సీటు తనకంటే తనకని కొంతమంంది కొత్త నేతలు బహిరంగ దూషణలకు దిగుతున్నారని అంటున్నారు.

వీటన్నింటికీ ప్రధాన కారణం… నియోజకవర్గాలను ఇన్ ఛార్జులను ప్రకటించకపోవడమే అనేది ప్రధాన అంశంగా ఉంది. అధికార వైసీపీ ఇప్పటికే ఆ విషయంలో కసరత్తులు చేసి 20-30 మంది మినహా మిగిలిన స్థానాల్లో సిట్టింగులకే సీట్లు అని కథనాలొస్తున్నాయి. ఇదే సమయంలో పక్క పార్టీలనుంచి వచ్చిన నేతల విషయంలో కూడా చంద్రబాబు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని వారికి నియోజకవర్గాల కేటాయింపులు కూడా చేసేస్తున్నారు.

అయితే ఫస్ట్ టైం అత్యంత బలంగా రంగంలోకి దిగాలనుకున్న పవన్… ఈ విషయంలో ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందనే విషయం గ్రహించాలని ఈ సందర్భంగా పలువురు సూచిస్తున్నారు. మరి ఈ సవాళ్లను పవన్ ఈ దఫా యాత్రలో అయినా సరిచేసుకుంటారా.. లేక, మీటింగ్ పెట్టి, స్థానిక ఎమ్మెల్యేలపై విమర్శలు చేసి, నాలుగు రోజులు మీడియాలో సందడి చేసి వెళ్లిపోతారా అన్నది వేచి చూడాలి.