తెలుగుదేశం పార్టీకి గ్రౌండ్ లెవల్లో వున్న బలమెంత.? జనసేన పార్టీకి వున్న బలమెంత.? ఈ లెక్కల్ని బట్టి చూస్తే, పొత్తు ధర్మంలో భాగంగా జనసేన పార్టీకి పదో పాతికో సీట్లను టీడీపీ కేటాయించడంలో వింతేముంది.? పోనీ, అవసరార్థం ఇంకో పది సీట్లు.. మరీ గట్టిగా అంటే, జనసేన పార్టీ ఆశిస్తున్నట్లు ఓ యాభై అరవై సీట్లు.. అదీ తప్పనిసరై టీడీపీ కేటాయిస్తుందేమో.
అంతేగానీ, టీడీపీ కంటే జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయింపు అనేది పొత్తు ధర్మంలో కుదరని పని. అయితే, తమకు టీడీపీ కంటే ఎక్కువ సీట్లు కేటాయించడం జరుగుతుందంటూ జనసేన వర్గాలు లీకులు పంపుతున్నాయి. కానీ, ఇదంతా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి చెందిన వ్యవహారం మాత్రమే సుమీ.!
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ ఒకింత బలంంగానే కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఈ జిల్లాల్లో అత్యంత కీలకం. ఆ కోణంలోనే, జనసేనకు అదనపు అడ్వాంటేజ్ వుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ కూడా, ఈ రెండు జిల్లాల్లో ఏదో ఒక జిల్లాలో జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు.. అంటే, టీడీపీ కంటే కనీసం ఒక్క సీటైనా ఎక్కువగా ఇవ్వాలని అనుకుంటోందిట. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి చెందిన పలువురు టీడీపీ నేతలు, ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోపక్క, ఒక్క సీటు కూడా టీడీపీ నుంచి తమకు కేటాయించబడని జిల్లాలు ఒకటో రెండో వుండొచ్చని జనసేన పార్టీ ఓ నిర్ణయానికి వచ్చేసిందట. మరీ, సున్నా.. అయిపోకుండా, ఒక్క సీటన్నా ఆయా జిల్లాల్లో కేటాయించాలని టీడీపీని కోరుతోందట జనసేన.