జనసేన టార్గెట్ ఆ 55 మాత్రమేనట.!

‘మాకు 25 శాతానికి పైగా ఓటు బ్యాంకు వుంది. కొన్ని చోట్ల అది 35 శాతం వరకూ వుండొచ్చు.. ముందు ముందు మాకు రాబోయే ఓటు బ్యాంకు ఇంకా పెరుగుతుంది..’ కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఇది. స్థానిక ఎన్నికల్లో జనసేన కొన్ని చోట్ల గట్టిగానే ప్రభావం చూపింది. టీడీపీ చేతులెత్తేసిన చోట కూడా, జనసేన బలంగా నిలబడింది.

కొన్ని సర్వేల్లో జనసేన పార్టీకి 22 నుంచి 25 శాతం ఓటు బ్యాంకుని కట్టబెడుతున్న మాట వాస్తవం. కానీ, చాలా సర్వేల్లో జనసేన పార్టీ ఓటు బ్యాంకు 10 నుంచి 12 శాతం వరకు మాత్రమే చూపిస్తున్నాయ్. దాంతో, జనసేన పార్టీకి వున్న నిఖార్సయిన ఓటు బ్యాంకు ఎంత.? అన్నదానిపై జనసేన వర్గాల్లోనే ఒకింత గందరగోళం వుంది.

ఏదిఏమైనా, పొత్తులతోనే ఎన్నికలకు వెళుతుంది జనసేన. అది కేవలం బీజేపీతో మాత్రమేనా.? టీడీపీతో కూడానా.? అన్నదానిపై కొంత సస్పెన్స్ వుంది. అలా కలిసి వెళితే, జనసేన ఓటు బ్యాంకు కాస్త ఎక్కువ చూపించుకోవడానికి వుంటుందా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.

ఒంటరిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా.. జనసేన ఫోకస్ చేసేది ఆ 55 నియోజకవర్గాల మీదనేనట. ఇందులో మెజార్టీ సీట్లు ఉభయ గోదావరి జిల్లాల్లోనే. కానీ, పొత్తులంటే, కొన్ని బలమైన నియోజకవర్గాల్నీ వదులుకోవాల్సి రావొచ్చు. లాభ నష్టాలు రెండూ వుంటాయి.. పొత్తుల్లో వున్న పార్టీలకి.

‘ఎన్నికల్లో గెలిచే సీట్లను బట్టి ముఖ్యమంత్రి ఎవరన్నది తేలుతుంది..’ అని జనసేనాని అంటున్నారు. అది నిజమే కూడా.! కానీ, టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పదవి వదులుకోదు. అసలంటూ టీడీపీ గెలుస్తుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. 55 కాకపోయినా, కనీసం ఓ 35 సీట్లలో అయినా జనసేన గెలిస్తే.. ‘డిమాండ్ చేసే’ పరిస్థితి రావొచ్చు. కానీ, పది గెలవడమే కష్టమని పలు సర్వేలు చెబుతున్నాయ్ మరి.!