జనసేనకు ‘బెంగ’ మొదలైందట, అందుకేనా.?

They are the strength of the Janasena,

జనసేనకు ‘బెంగ’ మొదలైందట, అందుకేనా.?

పంచాయితీ ఎన్నికల్లో జనసేన పార్టీ మెరుగైన ప్రదర్శనే చేసింది. వెయ్యికి పైగా పంచాయితీలు గెలుచుకున్నట్లు జనసేన అధికారికంగానే ప్రకటించినప్పటికీ, ఆ స్థాయిలో కాకపోయినా బాగానే పెర్ఫామ్ చేసిందని రాజకీయ విశ్లేషకులూ ఒప్పుకుంటున్నారు. అయితే, 27 శాతం వరకు ఓటు బ్యాంకు సాధించేసినట్లు సాక్షాత్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో, మునిసిపల్ – పరిషత్ ఎన్నికలు జనసేన పార్టీకి కత్తిమీద సాముగా మారాయి.

మునిసిపల్ – పరిషత్ ఎన్నికలకు సంబంధించి జనసేన తరఫున పడ్డ నామినేషన్లు ఎన్ని.? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. చాలా తక్కువ చోట్ల మాత్రమే జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అందుకు చాలా కారణాలున్నాయి. సహజంగానే అధికార పార్టీ ప్రదర్శించే జులుం, అప్పటికి జనసేన ఇప్పుడున్నంత బలంగా లేకపోవడం.. వీటన్నిటి కారణంగా.. అప్పట్లో నామినేషన్లు తక్కువగా పడ్డాయి.. కరోనా నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ఆ సంగతి పక్కన పెడితే, బరిలో వున్న చోట్ల మాత్రం ప్రచారం హోరెత్తిస్తోంది జనసేన పార్టీ. స్వయంగా జనసేన అధినేత కూడా రంగంలోకి దిగి ప్రచారం చేయబోతున్నారు.

పంచాయితీ ఎన్నికలు పార్టీల గుర్తుల మీద జరగలేదు. దాంతో వైసీపీ, టీడీపీ జనసేన.. ఎవరికి నచ్చిన ఫిగర్ వాళ్ళే చెప్పేసుకుని.. తమ తమ విజయాల గురించి ప్రకటించేసుకున్నారు. మునిసిపల్, పరిషత్ ఎన్నికలకు అలా కుదరదు. ఖచ్చితంగా ఇక్కడ ఓటింగ్ శాతాల లెక్క తేలుతుంది. పంచాయితీ ఎన్నికల్లో 27 శాతం ఓటు బ్యాంకు అని చెప్పేశారు గనుక, మునిసిపల్ ఎన్నికల్లో దానికి కాస్త అటూ ఇటూగా ఓటు శాతం వచ్చి తీరాలి. లేనిపక్షంలో జనసేన కూడా ఇతర పార్టీల్లా తప్పుడు ప్రచారాలు చేస్తుందనే ముద్ర జనంలోకి వెళ్ళిపోతుంది. తద్వారా ‘మార్పు’ గురించి ఆలోచించే ఆ కాస్త మంది దృష్టిలో కూడా జనసేన పలచనైపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో జనసైనికుల్లో ‘బెంగ’ మొదలైందట. ప్రచారం ఉధృతంగా సాగిస్తున్నా.. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నా.. ఓట్లు పడతాయా.? లేదా.? అన్న బెంగ మాత్రం జనసైనికుల్లో, జనసేన నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.