జనసేనకు గ్రాడ్యుయేట్లు లేరా వీరూ..?

ఏపీలో బీజేపీ – జనసేనల పరిస్థితి చూస్తుంటే ఒకపట్టాన్న అర్ధం కాని పరిస్థితి! “రాబోయే ఎన్నికల్లో బీజేపీ – జనసేన కలిసే పోటీచేస్తాయి” అని చెబుతుంటారు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. నిజమే కాబోలు అనుకునేలోపు.. పవన్ – చంద్రబాబులు కలిసి మీటింగులు పెట్టుకుంటారు, ప్రెస్ మీట్ లు పెడుతుంటారు, ఫోటోలకు ఫోజులుస్తుంటారు! ఆ సంగతులు అలా ఉంటే… ఈ త్రిముఖ రాజకీయ ప్రేమకథలో తాజాగా బీజేపీకి జనసేనకు మధ్య బీటలు వారుతున్నాయని తెలిసే ఒక విషయం వెలుగులోకి వచ్చింది!

వివరాళ్లోకి వస్తే.. బీజేపీ – జనసేనలు మిత్రపక్షాలం అని చెప్పుకుంటున్న ఏపీలో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. వీటీలో తొమ్మిది స్ధానిక సంస్థ‌ల కోటా స్థానాలు, మూడు పట్టభద్రుల కోటాలు కాగా మిగిలిన రెండు ఉపాధ్యాయ కోటాలుగా భర్తీ అవుతాయి. అయితే.. స్థానిక సంస్థ‌లు, ఉపాధ్యాయ కోటాలో భర్తీ అవ్వాల్సిన స్థానాలను విడిచిపెట్టేసిన బీజేపీ… పట్టభద్రుల కోటాలో భర్తీ అయ్యే మూడు స్థానాల్లో మాత్రం పోటీ చేయాలని నిర్ణయించింది!

సరిగ్గా ఇక్కడే బీజేపీ – జనసేనల మధ్య గ్యాప్ వచ్చిందన్న విషయం అర్ధం అవుతుంది. ఎందుకంటే… ఈ మూడు స్థానాలకు గానూ బీజేపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించేసింది. ఈ మూడింటిలో ఒకటి కూడా జనసేనకు కేటాయించలేదు. సరికదా… కనీసం మాటవరసకైనా పవన్ ను సంప్రదించలేదట! దీంతో… వీరిమధ్య గ్యాప్ పెరిగిందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో “ఇది ఏమాత్రం మిత్రధర్మం కాదు” అనేది జనసైనికుల ఆవేదనగా ఉంది!

దీంతో… జనసైనికుల నుంచి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి! వాటిలో ప్రధానమైనది… జనసేనకు మద్దతిచ్చే గ్రాడ్యుయేట్లు ఏపీలో లేరా వీరూ గారు? అని! ఈ ప్రశ్నలో న్యాయం ఉందనేది పలువురి అభిప్రాయం!

ఎందుకంటే… ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో జనసేనకు కాస్తో కూస్తో బలం ఉందని జనసేన నేతలు చెబుతుంటారు! ఈ లెక్కన పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోయే మూడు జిల్లాల్లో జనసేనకు కూడా ఎంతో కొంత ఓట్లయితే ఉంటాయనే అనుకోవాలి! మరి ఆ ఓట్లను బీజేపీ వద్దనుకుంటుందా? లేక, “వితౌంట్ జనసేన” ఒకసారి ట్రైల్ రన్ వేయాలని భావిస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి!