మూడో”సారీ” వద్దు… ఆ ఒక్కటీ అడుగు చాలు!

ఎన్నికలు సమీపిస్తున్నాయంటే సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి అన్నట్లుగా ఉంటుంటుంది రాజకీయ నాయకులు, పార్టీల పరిస్థితి. ఒక్కొక్కరిదీ ఒక్కో లక్ష్యం.. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బహిరంగంగా ప్రకటించే లక్ష్యం కాగా.. మరొకటి హిడెన్ అజెండా.. రహస్య లక్ష్యం! ఈ విషయంలో ఇప్పుడు ప్రధానంగా.. టీడీపీ, జనసేన మధ్య బహిరంగ లక్ష్యం, హిడెన్ అజెండాలు రెండూ ఉండటం.. పైగా అవి ఇరుపార్టీలకు తెలిసి ఉండటం ఆసక్తిగా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది.

ఏపీలో అధికార పార్టీ సంగతి కాసేపు పక్కనపెడితే… ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని విపక్షాలు పంతం పట్టుకు కూర్చున్నాయి. ఈసారి కూడా ఓడిపోతే పార్టీల మనుగడే ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం లేకపోలేదని ఆ పార్టీల అధినేతలు నమ్ముతున్నారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో… అటు టీడీపీ, ఇటు జనసేన రెండు పార్టీల మధ్య బహిరంగంగా ఉన్న లక్ష్యాలేమిటి, తెరవెనుకున్న హిడెన్ అజెండాలు ఏమై ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం.!

గత ఎన్నికల్లో వైసీపీకి ఉన్న బలంతో పోలిస్తే.. ఇప్పుడు ఆ పార్టీని ఒంటరిగా ఎదుర్కోలేమని ఒప్పుకున్నా తమ్మేమీ కాదనేది టీడీపీ ఉద్దేశ్యంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోపక్క గత ఎన్నికల్లో పెఫార్మెన్స్ చూసిన తర్వాత.. ఒంటరిగా పోటీచేస్తే వీర మరణమే అని పవన్ స్వయంగా ప్రకటించుకున్న పరిస్థితి! ఒకరు ఓపెన్ గా చెప్పినా.. మరొకరు చెప్పకపోయినా.. రెండు పార్టీల అంతరగం అదేనందేది ఓపెన్ సీక్రెట్ అని అంటున్నారు పరిశీలకులు.

ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఎలాగైన గెలిచి నిలవాలని టీడీపీ భావిస్తున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా జనసేనతో పొత్తుపెట్టుకుంది! ఈ సమయంలో ఆ పార్టీని 25 స్థానలవారకూ ఇచ్చి.. మిగిలిన 150 నియోజకవర్గాల్లోనూ జనసైనికుల సేవలు వినియోగించుకోవాలని టీడీపీ భావిస్తుంది. ఫలితంగా… మెజారిటీ సీట్లలో తెలిస్తే సెకండ్ థాట్ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని ప్లాన్ చేస్తున్నట్లుంది!

అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమనుకుంటున్నారనే సంగతి కాసేపు పక్కనపెడితే… జనసేన సీరియస్ పాలిటిక్స్ చేయాలని భావించే నాయకులు, ఆశావహులు మాత్రం రాబోయే ఎన్నికల్లో కనీసం 60 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయాలని.. కనీసం 35 – 40 స్థానాల్లో గెల్లిచేలా చుసుకోవాలని.. ఫలితంగా… టీడీపీతో కలిసి అధికారాన్ని షేర్ చేసుకోవచ్చని భావిస్తున్నారు.

అయితే ఈ విషయంలో పవన్ ఎంత గట్టి పట్టుమీద ఉంటారనే దానిపై టీడీపీ-జనసేన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందనేది సుస్పష్టం అని అంటున్నారు పరిశీలకులు! వాస్తవానికి జనసైనికులు అంతా మనసుపెట్టి పనిచేయాలంటే… సీఎం రేసులో పవన్ ఉన్నాడని పూర్తిగా నమ్మాలంటే… ఆ స్థాయిలో గ్రౌండ్ లెవెల్ లో కష్టపడి పనిచేయాలంటే… జనసేనకు టీడీపీ కనీసం 60 సీట్లు కేటాయించాలని అంటున్నారు కాపు సామాజికవర్గ నేతలు.

ఇప్పుడు తాజాగా జనసైనికుల నుంచి కూడా అదే వెర్షన్ వినిపిస్తుందని అంటున్నారు. టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే… సీఎం అభ్యర్థి చంద్రబాబే అని లోకేష్ వ్యాఖ్యానించిన అనంతరం… జనసైనికులు డల్ అయిపోయారని అంటున్నారు. ఈ సమయంలో వారిలో నాటి బలం, నమ్మకం కలిగించాలంటే… 60 సీట్లకు తగ్గకుండా పవన్ సాధించాలని.. చంద్రబాబును ఆ ఒక్కటీ అడిగితే చాలు మిగిలినది తాము చూసుకుంటామని సంకేతాలిస్తున్నారని అంటున్నారు.

అదే జరిగితే… కచ్చితంగా కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కల్యాణ్ సీఎం రేసులో ఉంటారని నమ్మొచ్చని.. ఫలితంగా శ్రమపడినా దానికి ప్రయోజనం ఉంటుందని.. అలా కాకుండా పాతిక సీట్లు తీసుకుందాం అని పవన్ అని… పొత్తులో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ నేత సీఎం అవుతాడని టీడీపీ చెప్పి మరోసారి తమను బలిపశువులను చేయొద్దని జనసైనికులు బలంగా కోరుకుంటున్నారని తెలుస్తుంది. అలా వారు ఆశించినట్లుగా పవన్ సీట్లు దక్కించుకోనిపక్షంలో… మూడోసారి కూడా “సారీ”!