టీడీపీ – జనసేన… పవన్ మౌనానికి కారణం ఈ సీట్లే?

ఏపీలో సార్వతిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఒకపక్క అధికార వైసీపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో దూకుడు ప్రదర్శిస్తుంది. ఇప్పటికే మూడో లిస్ట్ ను సిద్ధం చేసిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి తర్వాత పూర్తిస్థాయిలో అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ తెచ్చేసుకుని ఇక ఒక పథకం ప్రకారం జనాల్లోకి వెళ్లడమే అని అంటున్నారు. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఒక 60 సీట్లపై ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చారని తెలుస్తుంది.

ఆ సీట్లలోని అభ్యర్థుల ప్రకటనకూ సంక్రాంతినే ముహూర్తంగా పెట్టారని సమాచారం. అయితే జనసేన మాత్రం ఈ సంక్రాంతికి కార్యకర్తలకు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు. ఆ పార్టీ అధినేత గతకొన్ని రోజులుగా మౌనంగా ఉన్నారు! సీట్ల సర్ధుబాట్లు, ఎంపికలు చంద్రబాబును ఒప్పించడాలతో తలమునకలవుతున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో పవన్ మౌనానికి కారణంగా కొన్ని సీట్లకు సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా… ప్రధానంగా జనసేన బలంగా ఉన్న కొన్ని స్థానాలను పవన్ కల్యాణ్ ఎంపిక చేసుకున్నప్పటికీ వాటికి టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదని.. ఆల్టర్ నేటివ్ చూసుకోమనే సంకేతాలు వస్తున్నాయని అంటున్నారు. దీంతో ఈ సంక్రాంతికి పవన్.. జనసైనికులకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఆల్ మోస్ట్ ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఈ క్రమంలో పవన్ మౌనానికి కారణమైన ఆ సీట్లేమిటో ఇప్పుడు చూద్దాం!

మొదటి నుంచీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వీలైనన్నీ ఎక్కువస్థానాలు తీసుకోవాలని పవన్ ఆశిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కూడా ఉంది. ఇక్కడ నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి మళ్లీ పోటీకి సిద్ధం అంటున్నారు. మరోపక్క ఆయన ప్లేస్ లో జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీకి రెడీగా ఉన్నారు. ఇది పొత్తులో పెద్ద కుంపటిలా తయారవుతుంది!

ఇక కొత్తపేట విషయానికొస్తే ఇక్కడ నుంచి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనందం కూడా పోటీకే సై అంటున్నారు. ఇదే క్రమంలో… పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ సీటు వదులుకునేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరని తెలుస్తుంది. అయితే వీటిపై జనసేన కూడా ఆశ చూపిస్తుంది.

ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా… ప్రధానంగా జనసేన ఆశిస్తున్నట్లు చెబుతున్న నరసాపురం, కోవూరు, తణుకు, తాడేపల్లిగూడెం వంటి సీట్ల మీద చర్చ జరుగుతోంది. ఈ స్థానాల్లో కూడా టీడీపీ తరుపున బలమైన నేతలు, సీనియర్లే ఉండటంతొ ఈ చిక్కుముడి వీడటం లేదని తెలుస్తుంది. ఈ లిస్ట్ లో ప్రధానంగా తణుకు నుంచి మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ టిక్కెట్ వదిలే ప్రసక్తి లేదని తెలుస్తుంది.

ఇక బందరు పార్లమెంట్‌ స్థానంలో కొనకళ్ల నారాయణ, అవనిగడ్డలో మండలి బుద్ద ప్రసాద్‌, పెడనలో కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణ ప్రసాద్‌ కు అవకాశం ఉండకపోవచ్చనే చర్చ తెరపైకి రావడంతో అక్కడ తమ్ముళ్లు వేడెక్కిపోతున్నారని అంటున్నారు. ఇక గుంటూరు జిల్లా తెనాలిలో ఆలపాటి రాజా అనుచరులు కూడా ఫైరవుతున్నారని తెలుస్తుంది. దీంతో ఈ చిక్కుముడులు వీడేవరకూ జనసేనాని మౌనం వీడే ప్రసక్తి లేదని అంటున్నారు!