2024 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకునే అవకాశాన్ని సైతం జనసేన పార్టీ సంపాదించుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఇంకా నయ్యం.. జనసేన పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు అయినా గెలవాలి కదా.? అంటున్నారనుకోండి కొందరు.. అది వేరే విషయం.!
వాస్తవానికి, జనసేనకు గోల్డెన్ ఆపర్చ్యూనిటీస్ చాలానే లభిస్తున్నాయి. గడచిన నాలుగేళ్ళలో జనసేన పార్టీ గనుక బలంగా నిలబడి వుంటే, రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి బదులు, జనసేన గురించి జనం ఎక్కువగా మాట్లాడుకునేవారే.
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికల్ని చూస్తున్నామిప్పుడు. కానీ, ఆ చేరికల కంటే ఎక్కువ స్థాయిలో జనసేనలోకి వైసీపీ నుంచి చేరికలు వుండేవి.. జనసేన గనుక బాధ్యతాయుతంగా వ్యవహరించి వుంటే.
మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ బీజేపీ నుంచి జనసేనలోకి వెళతారని అంతా అనుకుంటే, ఆయన అనూహ్యంగా టీడీపీలోకి దూకారు. వైసీపీ నుంచి గెంటివేయబడ్డ నలుగురు ఎమ్మెల్యేలూ టీడీపీ వైపు నడుస్తున్న సంగతి తెలిసిందే.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఓ దశలో జనసేన వైపు చూశారు.. ఆయనా ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా జనసేన వైపే చూశారు, కానీ, మనసు మార్చుకుని టీడీపీలోనే కొనసాగుతున్నారు.
తాజాగా మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన వైపు వెళ్ళాలనుకున్నా, చివరికి ఆయన టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారట. టీడీపీ కుదరకపోతే, బీజేపీ వైపు వెళతారు తప్ప, జనసేన గురించి ఆలోచించడంలేదట. ఎందుకిలా.? ఎందుకంటే, జనసేనది స్వయంకృతాపరాధం గనుక.!