చంద్రసేన.! అశ్వనీదత్‌పై జనసేన గుర్రు.!

రెండు రాజకీయ పార్టీల మధ్య పొత్తు అనేది.. కొత్త విషయమేమీ కాదు.! ఇదేమీ నిందించాల్సిన విషయమూ కాదు.! వామపక్షాలు పూటకో పార్టీతో పొత్తు పెట్టుకుంటాయన్న విమర్శ వుంది. టీడీపీతో బీజేపీ కలిసింది, విడిపోయింది.. మళ్ళీ కలుస్తుందేమో.! తెలంగాణ రాష్ట్ర సమితిగా వున్నప్పుడు కేసీయార్, చాలా పార్టీలతో కలిశారు.

అయితే, కేవలం జనసేన పార్టీ మీదనే ‘ప్యాకేజీ’ అనే ముద్ర ఎందుకు పడుతోంది.? అంటే, ముద్ర పడ్డప్పుడు.. దాన్ని చెరిపేసుకునేందుకు జనసేన తగిన ప్రయత్నాలు చేయకపోవడం వల్లనే ఈ దుస్థితి.. అని చెప్పక తప్పదు.

ప్యాకేజీ, దత్త పుత్రుడు.. ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు, వాటిని ఖండించడానికి అప్పట్లో జనసేన పార్టీకి సరైన యంత్రాంగం లేదు. ఇప్పుడూ అంతే. జనసేన వాయిస్ గట్టిగా వినిపించే పరిస్థితి కనిపించదు. వాస్తవానికి, ‘దత్త పుత్రుడు’ అన్న ప్రస్తావన తొలుత చేసింది నారా లోకేష్.

ఇప్పుడు అదే టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటోంది. సినీ నిర్మాత, టీడీపీ నేత అశ్వనీదత్ అయితే, ‘చంద్ర సేన’ అనేశారు తాజాగా. టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తే, ‘చంద్ర సేన’ అనేస్తారా.? ఇదెక్కడి పంచాయితీ.? అశ్వనీదత్ ఏ ఉద్దేశ్యంతో ఆ మాట అన్నాగానీ, జనసేన పార్టీకి మాత్రం, ఈ చంద్రసేన ప్రస్తావన అస్సలు రుచించడంలేదు.

‘ఆయనెలా చంద్ర సేన అని అనగలుగుతారు.? రెండు పార్టీల మధ్య పొత్తు వుంటుంది. చంద్రబాబు – పవన్ కళ్యాణ్.. ఈ విషయమై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.. రెండు పార్టీల మధ్య పొత్తుని అవమానకరమైన రీతిలో, అందులోని ఇంకో పార్టీనే చూడటం బాధాకరం..’ అన్నది జనసేన ఆవేదనగా కనిపిస్తోంది.