జనసేన ఫోకస్ కేవలం 75 సీట్ల మీదేనా.?

మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ‘అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల్ని నిలబెట్టే సత్తా వుందా.? లేకపోతే, మీది ప్యాకేజీ పార్టీనే..’ అంటూ జనసేన పార్టీ మీద వైసీపీ పదే పదే విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అన్ని స్థానాల్లోనూ మేమే పోటీ చేస్తాం. మాది ప్యాకేజీ పార్టీ కాదు’ అని మాత్రం గట్టిగా చెప్పలేకపోతోంది జనసేన. ‘ప్యాకేజీ పేరెత్తితే చెప్పుతో కొడతాం..’ అని జనసేనాని స్వయంగా ‘చెప్పు’ చూపించిన వైనాన్ని తిలకించాం. మరి, అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని చెప్పరేం.? అన్నది వైసీపీ ప్రశ్న.

సరే, రాజకీయాలన్నాక వ్యూహాత్మక ఎత్తుగడలు, రాజకీయ విమర్శలూ మామూలే. ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్నది జనసేన ఇష్టం. 2019 ఎన్నికల్లో 130కి పైగా నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసింది. కానీ, ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా వుండబోతోందిట. 2019 ఎన్నికలతో పోల్చితే, జనసేన గణనీయంగా బలపడినా, పోటీ చేసే సీట్ల సంఖ్య తక్కువగా వుండబోతోందిట.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనసేన పార్టీ 75 సీట్లలో పోటీ చేయొచ్చని తెలుస్తోంది. ఈ నెంబర్ ఇంకాస్త పెరిగితే 90 టచ్ చేయొచ్చు తప్ప.. అంతకన్నా మించి పోటీ చేకపోవచ్చునట. దానిక్కారణం, అన్ని సీట్లలో పోటీ చేసి దెబ్బ తినే కంటే, తక్కువ సీట్లలో పోటీ చేసి, వాటి మీద స్పెషల్ ఫోకస్ పెడితే రిజల్ట్ మెరుగ్గా వుంటుందన్నది జనసేన ఆలోచన అట.

‘ఎట్టి పరిస్థితుల్లోనూ కింగ్ మేకర్ అవుతాం. పొత్తు లేకున్నా యాభై నుంచి అరవై సీట్లలో గెలవాలంటే, 100 సీట్లలోపే పోటీ చేయడం బెటర్..’ అని జనసేనలో చర్చ జరుగుతోందని తెలుస్తోంది.