సంచలనం:  టిడిపి-జనసేన మధ్య ఫ్లెక్సీల యుద్ధం..వెనకెవరున్నారో ?

ఇప్పటి వరకూ టిడిపి, జనసేన మధ్య మాటలకే పరిమితమైన యుద్ధం తాజాగా ఫ్లెక్సీలకు కూడా పాకింది. మొదటి నుండి ప్రత్యర్ధులపైన కానీ ప్రత్యర్ది పార్టీలపై వ్యతరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటంలో తెలుగుదేశంపార్టీ నేతలే ముందుండేవారు. అటువంటిది  చంద్రబాబునాయుడును లక్ష్యంగా చేసుకుని జనసేన అమరావతి ప్రాంత అధికారప్రతినిధి మండలి రాజేష్ ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ సంచలనంగా మారింది. జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ నేరుగా చంద్రబాబునే అటాక్ చేయటంతో తమ్ముళ్ళు బిత్తరపోయారు. 

బహిరంగగసభల్లోను, మీడియాలో మాత్రమే ఇంతకాలం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుపై మండిపడుతుండేవారు. ఏవో ఆరోపణలు చేస్తు తర్వాత మరచిపోయేవారు. కానీ చంద్రబాబునుద్దేశించి జనసేన పేరుతో ఓ ఫ్లెక్సీ ఏర్పాటవ్వటం మాత్రం ఇదే ప్రధమనే చెప్పాలి. ఇంతకీ జనసేన తరపున చంద్రబాబు గాలితీసేట్లుగా అంతలావు ఫ్లెక్సీ ఎందుకు విజయవాడ నడిబొడ్డున ఏర్పాటయ్యింది ? ఎందుకంటే, పవన్ వెనుక తెలంగాణ కు చెందిన ఒక ప్రముఖ నాయకుడు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. రాత్రికి అమరావతికి పారిపోయిన చంద్రబాబు నాయుడు , ఇపుడు ఎన్నికల పేరుతో తెలంగాణలో జండా ఎగరేసే ప్రయత్నం చేస్తుండటం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేదు. అందువల్ల ఆంధ్రలో చంద్రబాబు పునాదిని కదిపేందుకు ఆ తెలంగాణ నేత పవన్ తో చంద్రబాబు మీద ప్రాగ్జి యుద్ధం చేస్తున్నారనిఒక కథ తెలుగుదేశం వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఎందుకంటే, రోజు రోజు పవన్ కల్యాణ్ చంద్రబాబు మీద దాడి తీవ్రం చేస్తున్నారు. మెల్లిగా ఆయన ఇతర పార్టీల మీద అంటే వైసిపి, మోదీగారి బిజెపి మీద దాడి తగ్గించడం కనిపిస్తుంది. పవన్ తెలంగాణలో పోటీ చేయకపోవడానికి కారణం కూడా ఈ రాజకీయంలో ఉందని అంటున్నారు. ఇంతవరకు ఉపన్యాసాలకు పరిమితమయిన పవన్-టిడిపి మాటల యుద్ధం ఇపుడు   ఫ్లెక్సీల రూపం తీసుకుంది.  చంద్రబాబుతో పాటు టిడిపి నేతల దుమ్ముదులిపే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది.

కొంతకాలంగా విజయవాడ కేంద్రంగా తెలుగుదేశంపార్టీ ప్రత్యర్ధులపై ఫ్లెక్సీ యుద్ధానికి తెరలేపిన విషయం అందరికీ తెలిసిందే. ఇంతకాలం బిజెపి, జనసేనలపై తెలుగుదేశంపార్టీ నేత కాట్రగడ్డ ప్రసాద్ పేరుతో ఫ్లెక్సీలు వెలిసేవి. తాజాగా  జనసేన పేరుతో వెలసిన ఫ్లెక్సీ లు  తమ్ముళ్ళ మీద గురిపెట్టాయి . 

ఫ్లెక్సీలో ఇలా ఉంది.

‘‘పిచ్చి ముదిరిన పచ్చ పురాణం..ఏం తమ్ముళ్ళూ వేధిస్తోందా ?..ఓటమి భయం, గుర్తుస్తోందా ? దశాబ్ద ప్రతిపక్ష కాలం..’’ అంటూ నిలదీశారు. టిడిపి పదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్న విషయాన్ని జనసేన ఫ్లెక్సీ గుర్తుచేసింది. 2009లో బెజవాడ గడ్డమీద మీరు జీరో అంటూ చంద్రబాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలే చేశారు. 2014లో ఎలా అయ్యారు హీరో అంటూ నిలదీశారు.

‘‘2014లో హీరో అయ్యింది మీ నాయకుడి (చంద్రబాబు) తంత్ర ఫలమా లేకపోతే తమ నాయకుడి (పవన్ కల్యాణ్)కాళ్ళు మొక్కిన ఫలమా’’ అంటూ ఎద్దేవా చేశారు. 2019లో ఓటమి భయంతోనే చంద్రబాబు కాంగ్రెస్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు.

పనిలో పనిగా టిడిపికి మద్దతుగా నిలబడే ఎల్లో మీడియాను కూడా ఓ రేంజిలో దుయ్యబట్టారు. 2019లో తెలుగుదేశంపార్టీకి బుద్ది చెప్పకపోతే తాము జనసైనికులమే కాదంటూ తీవ్ర ప్రతిజ్ఞే చేశారు. తెలుగు తమ్ముళ్ళూ మీకు గోదావరి జిల్లాల్లోనే మొదలైంది కౌంట్ డౌన్ అంటూ తీవ్ర హెచ్చరికలే చేశారు.