దూకుడు పెంచిన పవన్… పిఠాపురం డౌట్ క్లియర్ చేసినట్లే!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో మూడు ప్రధాన పార్టీలు దూకుడుమీదున్నాయన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వరుస మీటింగులతో ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు కూడా గతానికి భిన్నంగా అప్పుడే అభ్యర్థుల ఎంపికలో ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో పవన్ కూడా దూకుడుపెంచారని తెలుస్తుంది.

ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… మూడు ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా… వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తున్న విషయం ఇప్పటికే ఫైనల్ కాగా… జనసేన – టీడీపీల పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్… గోదావరి జిల్లాల్లో మూడు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో వీరే జనసేన తరుపున ఎమ్మెల్యే అభ్యర్థులు అని అంటున్నారు.

అవును… ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ ఛార్జీలను నియమించింది జనసేన. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ ముగ్గురూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్టే అని ప్రచారం జరుగుతుంది. పైగా వారిలో మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉండటంతో… టిక్కెట్లు పక్కా అనే మాటలు వినిపిస్తున్నాయి.

అవును… నిన్న మొన్నటివరకూ తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటి ఊగాహాణాలకు తెరదింపుతూ… ఆ నియోజకవర్గానికి కూడా పవన్ ఒక ఇన్ ఛార్జి ని ఎంపిక చేశారు. ఇదే సమయంలో రాజానగరం, కొవ్వురు నియోజకవర్గాలకూ ఇన్ ఛార్జులను నియమించారు.

ఇందులో భాగంగా… పిఠాపురానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజానగరం నియోజకవర్గం ఇన్‌ ఛార్జీగా బత్తుల బలరామకృష్ణ అపాయింట్ అయ్యారు. ఇదే సమయంలో ఎస్సీ రిజర్వుడు స్థానం కొవ్వూరు ఇన్‌ ఛార్జీ బాధ్యతలను మాజీ శాసన సభ్యుడు టీవీ రామారావుకు అప్పగించారు. ఈయన గతంలో టీడీపీ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

గత ఎన్నికల్లో ఈ మూడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా పాతిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెండెం దొరబాబు ఘన విజయం సాధించారు. టీడీపీకి చెందిన ఎస్వీఎస్ఎన్ వర్మపై 14,992 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఇదే సమయంలో రాజానగరానికి జక్కంపూడి రాజా ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. గడిచిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా… టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ పై సుమారు 31,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఇక హోం మంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గం కొవ్వూరు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన వంగలపూడి అనితను ఏకంగా పాతిక వేలకు పైగా ఓట్ల తేడాతో వనిత మట్టికరిపించారు. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ గడిచిన ఎన్నికల్లో జనసేన మూడోస్థానానికి పరిమితమైన పరిస్థితి.

ఈ నేపథ్యంలో ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకూ జనసేన ఇన్ ఛార్జ్ లను నియమించింది. మరి పొత్తు అనివార్యమైతే ఈ లెక్కలు, పేర్లు మారతాయా.. లేక జనసేన ఈసారి ఒంటరిగా పోటీచేసి సత్తా చాటాలని భావిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.