పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ వ్యూహాత్మిక తప్పిదానికి పాల్పడిందా.? కలిసొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందా.? ఈ విషయమై జనసేన వర్గాల్లో ఒకింత అలజడి కనిపిస్తోంది. ‘టీడీపీకి ఊపిరి పోశాం.
జనసేన పార్టీ విజయావకాశాల్ని దెబ్బ తీసుకున్నాం..’ అంటూ జనసేన పార్టీకి మద్దతిస్తోన్న చాలామంది నెటిజన్లు తమ అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. వీరిలో జనసైనికులే ఎక్కువ. నిజమే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ తమ మిత్రపక్షం బీజేపీకి హ్యాండిచ్చి, టీడీపీకి తెరవెనుకాల మద్దతిచ్చింది.
ఈ విషయమై జనసేన పైకి గట్టిగా చెప్పుకోలేని పరిస్థితి. ‘వైసీపీ అనుకున్నది జరగదని జనసేనాని చెప్పారు మచిలీపట్నం సభలో. అదే జరిగింది..’ అని మాత్రం జనసేన నేతలు కొందరు ఎమ్మెల్సీ ఎన్నికలపై విశ్లేషిస్తున్నారు. ఇదే మరి భావదారిద్ర్యం అంటే.! 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన సెమీ ఫైనల్స్ ఇవి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ గనుక గట్టిగా వైసీపీకి పోటీ ఇవ్వగలితే.. జనసేన శ్రేణుల్లో ఇప్పుడు ఇంకో రకమైన ఉత్సాహం కనిపించేదే. కానీ, ఆ అవకాశాన్ని జనసేన పార్టీ చేజార్చుకుంది. అయితే, ఎన్నికల్లో పోటీ చేయడంటే.. ఆర్థికంగా చాలా భారం ఈరోజుల్లో.
బహుశా ఆ కోణంలోనే జనసేన వెనక్కి తగ్గి వుండొచ్చేమోనన్నది ఇంకో వాదన. ఎవరి గోల వారిది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అయితే జనసేనకు క్రెడిట్ ఇచ్చారు, టీడీపీ గెలుపులో. కానీ, టీడీపీలో ఇంకెవరూ జనసేనకి ఆ క్రెడిట్ ఇవ్వడంలేదు.