జనసేన పోటీ చేసే 41 అసెంబ్లీ సీట్లు 5 ఎంపీ సీట్లు ఇవే!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, మిత్ర పక్షాలకు కేటాయించే స్థానాలు, ఆపరేషన్ ఆకర్షలు.. ఇలా పలు అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేయడం ఖాయమైంది. ఈ విషయంలో ఎప్పటినుంచో జగన్ & కో చెబుతున్న మాట ఇదే! తాము ఎవరితోనూ పొత్తులో వెళ్లమని, తమకు ప్రజలతోనే పొత్తు అని! ఇక మరోవైపు జనసేన – టీడీపీ పొత్తు ఆల్ మోస్ట్ ఖాయమేనని చెబుతున్నారు! 2014 తరహా కూటమికి బీజేపీ ఒప్పుకోని పక్షంలో… అవసరమైతే బీజేపీని వదిలేస్తుంది కానీ… టీడీపీని వదిలే ప్రసక్తి లేదు.

ఈ క్రమంలో… మరీ ఇరవైకీ పాతికకు పరిమితం చేసిన తమ లెవెల్ తగ్గించొద్దని చెబుతున్న పవన్ మాటలకు బాబు & కో విలువిచ్చారో ఏమో కానీ… జనసేనకు 41 అసెంబ్లీ సీట్లు, 5 పార్లమెంటు సీట్లను చంద్రబాబు కేటాయించారంటూ ఒక లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పైగా ఈ లిస్ట్ చూసిన కొంతమంది టీడీపీ సీనియర్లు… ఒకటి రెండు సీట్లు మినహా ఈ జాబితానే ఫైనల్ కావచ్చని చెబుతున్నారు. జనసేనకు కేటాయిస్తారని చెప్పబడుతున్న ఈ సీట్లలో అత్యధికం ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లోనే ఉండటం గమనార్హం.

ఆ లిస్ట్ ఏమిటో – అక్కడ జనసేన అభ్యర్థులెవరో ఇప్పుడు చూద్దాం!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణ, అమలాపురంలో శెట్టిబత్తుల రాజబాబు, రాజోలులో బొంతు రాజేశ్వరరావు, రామచంద్రాపురం పోలిశెట్టి చంద్రశేఖర్, పి.గన్నవరంలో కొండలరావు, కొత్తపేటలో బండారు శ్రీనివాస్, మండపేటలో వేగుళ్ల లీలాకృష్ణ, తునిలో నాగబాబు, ప్రత్తిపాడులో సూర్యకిరణ్, పిఠాపురంలో మాకినీడి శేషుకుమారి, కాకినాడ రూరల్ లో పంతం నానాజీ, రాజమండ్రి రూరల్ లో కందుల దుర్గేష్, కాకినాడ సిటీ ముత్తా శశధర్, జగ్గంపేటలో పాటంశెట్టి సూర్యచంద్రలు ఉన్నారు. అంటే తూర్పుగోదావరిలో ఉన్న మొత్తం 19 అసెంబ్లీ స్థానాల్లో 14 చోట్ల టీడీపీ–జనసేన పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థులు బరిలోకి దిగనున్నారన్నమాట!

ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికొస్తే… గత ఎన్నికల్లో పవన్ పోటీచేసిన భీమవరంతో కలిపి… నరసాపురం, ఏలూరు, తాడేపల్లిగూడెం, ఆచంట, తణుకు, చింతలపూడి, పోలవరం, ఉంగుటూరు స్థానాల నుంచి జనసేన అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశముందని చెబుతున్నారు.

ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికొస్తే… కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, నూజివీడు, విజయవాడ పశ్చిమ స్థానాల్లోనూ.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెనాలి, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ నియోజకవగాల్లోనూ జనసేన అభ్యర్థులే పోటీచేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక ఉత్తరాంధ్రలో విశాఖపట్నం జిల్లా విషయానికొస్తే… గాజువాక, అనకాపల్లి, పెందుర్తి, భీమిలి స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతారని చెబుతున్నారు. అలాగే కడప జిల్లాలో రాజంపేట, రైల్వే కోడూరు స్థానాల్లోనూ జనసేన పోటీలో ఉంటుందని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో తిరుపతితోపాటు చిత్తూరు, మదనపల్లిలోనూ జనసేన బరిలోకి దిగడం ఖాయమని అంటున్నారు.

ఇదే క్రమంలో… రాయలసీమలో తిరుపతి నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఇదే క్రమంలో… పార్లమెంటు నియోజకవర్గాల విషయానికొస్తే.. కాకినాడ, అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం, ఏలూరుల్లో జనసేన పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఈ ఐదు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులే బరిలోకి దిగొచ్చని అంటున్నారు.

అయితే ఈ లిస్ట్ ని టీడీపీ వైరల్ చేస్తుందా.. లేక, తమ మనసులో మాటను బాబుకి ఇలా ఇండరెక్ట్ గా చెప్పుకునే ప్రయత్నం చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది!