‘2024 ఎన్నికల్లో ఖచ్చితంగా బలపడతాం.! 2019 ఎన్నికలతో పోల్చితే, ఒక్క సీటు అదనంగా వచ్చినా, మేం పుంజుకున్నట్టే. కానీ, టీడీపీ పరిస్థితి అది కాదు. ఖచ్చితంగా వైసీపీ దిగిపోవాలి.. అప్పుడే, టీడీపీకి లాభం. అవసరం టీడీపీది గనుక, తగ్గాల్సింది కూడా టీడీపీనే..’ అంటోంది జనసేన పార్టీ.
ఈ లాజిక్ కూడా నిజమే.! జనసేన పార్టీకి ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం దాదాపు ఇరవై శాతం వరకు ఓటు బ్యాంకు లభించే అవకాశముంది. సీట్ల పరంగా చూసుకున్నా 10 నుంచి 18 వరకు.. ఇంకా కలిసొస్తే, పాతిక వరకు అసెంబ్లీ సీట్లు సోలోగానే రావొచ్చు. ఇదంతా టీడీపీ అలాగే వైసీపీ.. విడివిడిగా చేయించుకుంటున్న అంతర్గత సర్వేల సారాంశం. వైసీపీ ఎలాగూ జనసేనతో కలవదు. జనసేన కూడా వైసీపీ వైపు వెళ్ళదు. టీడీపీ, జనసేన కలవాలంటే, జనసేనని టీడీపీ బుజ్జగించుకోవాలి.
2024 ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ గెలిస్తే, టీడీపీ ఖేల్ పూర్తిగా ఖతమ్ అయిపోతుంది. జనసేన పార్టీకి కొత్తగా వచ్చే నష్టం ఏమీ వుండదు.. పైగా, రాజకీయంగా పుంజుకునేందుకు అవకాశమైతే జనసేనకు దొరుకుతుంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ, ‘మేం గతంలో తగ్గాం. ఈసారికి తగ్గబోం. తగ్గాల్సింది టీడీపీనే. సీట్ల పంపకాల విషయంలో టీడీపీ వెకిలితనం మానెయ్యాలి..’ అని జనసేన నేతలు అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం జనసేన ఆశిస్తున్న సీట్ల సంఖ్య 45 నుంచి 75కి చేరుకుందిట.! ఆలస్యం అమృతం విషం.! ముందు ముందు, 80 నుంచి 90 వరకు జనసేన అడగొచ్చేమో కూడా!
