హాట్ టాపిక్… నెగోసియేషన్స్ చేతకానప్పుడు అలియన్స్ పెట్టుకోకూడదు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ – జనసేన పొత్తుపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధానంగా టీడీపీ – జనసేన అధికారంలోకి వస్తే ఐదేళ్లూ సీఎంగా చంద్రబాబే ఉంటారని లోకేష్ ప్రకటించినప్పటినుంచీ… జనసైనికులు మంటెత్తిపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో లోకేష్ స్టేట్ మెంట్స్ తర్వాత జనసైనికులు నెట్టింట చేస్తున్న కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి!

అవును… రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి గెలిచినప్పటికీ పవన్ కళ్యాణ్ కి సీఎం సీటు అనే ఛాన్సే లేదు అన్నట్లుగా టీడీపీ నాయకుడు నారా లోకేష్ మాట్లాడడంతో ఇపుడు జనసేన క్యాడర్ మండిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే జనసైనికుల్లో తీవ్ర అంతర్మధనం సాగుతోందని తెలుస్తుంది. ఆ విషయాన్ని నెట్టింట వారు పెడుతున్న పోస్టులు, రియాక్ట్ అవుతున్న విధానం వెల్లడిస్తుందని తెలుస్తుంది.

టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తే రెండున్నరేళ్ల పాటు పవన్ కు సీఎం కుర్చీ ఇవ్వాలని హరిరామ జోగయ్య లాంటి నాయకులు గట్టిగా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తే అయిదేళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉంటారు రెండవ మాటే లేదు అని లోకేష్ సూటిగా, సుత్తిలేకుండా చెప్పేశారు. పైగా… పవన్ కూడా చాలాసార్లు సీనియార్టీ, సమర్ధత కలిగిన వ్యక్తే సీఎం కావాలని చెప్పారని గుర్తుచేశారు!

ఇలా సీఎం పోస్ట్ విషయంలో సెకండ్ థాట్ లేదంటూ లోకేష్ చెప్పడాన్ని ఏమనుకోవాలని ప్రశ్నిస్తోంది జనసేన. పొత్తులో ఉన్నపుడు ఒక పార్టీ నాయకులు సున్నితమైన అంశాలపై ప్రకటనలు చేస్తున్నప్పుడు కాస్త ఆలోచింఛిమాట్లాడాలని.. కలిసి తీసుకున్న నిర్ణయాలనే వెల్లడించాలని.. అంతే తప్ప ఏకపక్షంగా మాట్లాడకూడదని చెబుతున్నారు. ఈ సందర్భంగా నెట్టింట వారి రియాక్షన్ వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా… చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటే.. పవన్ స్వయంగా జైలుకు వెళ్ళి పరామర్శించారు అని గుర్తు చేస్తున్నారు జనసైనికులు. అదే టైం లో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మరీ పొత్తు ప్రకటన చేశారని చెబుతున్నారు. పవన్ ఆ స్థాయిలో గౌరవం ఇచ్చి పొత్తు ధర్మాన్ని కాపాడినపుడు.. అధికారం పంచుకునే విషయంలో ఆ గౌరవం టీడీపీకి ఏది అనేది జనసైనికుల ఆవేదన అని తెలుస్తుంది.

ఇదే సమయంలో… అసలు నారా లోకేష్ ఈ తరహా కామెంట్స్ ఎలా చేయగలిగారు అని అంటున్నారు జనసైనికులు. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాదు అనడమేంటి అని అడుగుతున్నారు. అటు కేంద్రంలో బీజేపితో కూడా వైరం పెట్టుకుని మరీ పొత్తుకు సిద్దపడితే ఇపుడు ఇలా అవమానపరచడం చంద్రబాబుకే చెల్లిందని జనసైనికులు మండి పడుతున్నారు.

మరోపక్క పవన్ కల్యాణ్ తీరును కూడా జనసైనికులు తప్పుబడుతున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా… ఇటీవల కాలంలో.. ఉంటే ఉండండి పొతే పోండి అన్నట్లుగా పవన్ తేల్చి చెప్పేశారని.. చంద్రబాబు కోసం సొంత క్యాడర్ క్యారెక్టర్ ని కూడా అనుమానించారని.. ప్రశ్నిస్తే వారిని వైసీపీ కోవర్టులుగా చూస్తానని చెప్పడాన్ని గుర్తుచేస్తున్నారు.

ఇదే క్రమంలో… నెగోసియేషన్స్ చేతకానప్పుడు అలియన్స్ పెట్టుకోకూడదని ఫైరవుతున్నారు జనసైనికులు. లోకేష్ యువగళం చివరి రోజు సభకు పవన్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ రప్పించాలని వారు వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యిందని.. నాటి నుంచి జనసేనను వ్యూహాత్మకంగా డీగ్రేడ్ చేస్తున్నారని అంటున్నారు!

ఈ సమయంలో మరో లేఖాస్త్రం సంధించిన హరిరామ జోగయ్య… కాపు సామాజికవర్గానికి పవన్ ఏదో చేస్తాడని నమ్ముతూ వచ్చాం కానీ… తాజా పరిణామాలు చూస్తుంటే ఆయనపై వస్తున్న ప్యాకేజీ ఆరోపణలు నిజమనిపిస్తున్నాయి అంటూ సంచలన కామెంట్లు చేశారు. పవన్ వైఖరి చూస్తుంటే… జనసేనను టీడీపీలో విలీనం చేస్తారేమో అనిపిస్తుందని చెప్పడం గమనార్హం.