జనసేనకి నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడిస్తే.?

ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన నాదెండ్ల మనోహర్, ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక నేత. నిన్న మొన్నటిదాకా జనసేన పార్టీ అంటే నాదెండ్ల మనోహర్.. నాదెండ్ల మనోహర్ అంటే జనసేన పార్టీ.

జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా వ్యవహారాలతో బిజీగా వున్నప్పుడు, పార్టీకి అన్నీ తానే అయి వ్యవహరిస్తూ వచ్చారు నాదెండ్ల మనోహర్. కానీ, ఇప్పుడు సీన్ మారింది. మెగా బ్రదర్ నాగబాబు, మెల్లగా పార్టీలో కీలక బాధ్యతలు అన్నీ తనవైపుకు తిప్పుకుంటున్నారు.

పార్టీ కమిటీలకు సంబంధించి నియామకాల దగ్గర్నుంచీ అన్నీ నాగబాబే స్వయంగా చూసుకుంటున్నారు. అలాగని, నాదెండ్ల మనోహర్ ఇమేజ్ తగ్గలేదు. ‘నాదెండ్లను అనుమానిస్తే, నన్ను అనుమానించినట్లే..’ అని ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్, జనసైనికులకు అల్టిమేటం ఇచ్చేశారు.

అయినాగానీ, జనసైనికులైతే నాదెండ్ల మనోహర్‌ని పూర్తిగా నమ్మలేకపోతున్నారు. ‘నేనైతే తెనాలి నుంచి పోటీ చేస్తాను. పొత్తులు, సీట్ల పంపకాల గురించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడుకుంటారు..’ అని నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు, జనసైనికుల్ని అయోమయంలో పడేశాయి.

పొత్తులు కొలిక్కి వస్తే, ఎవరికి ఏ సీటు.. అనేది తేలుతుంది. అలాంటప్పుడు, నాదెండ్ల ముందే ఎలా సీటు ఖాయం చేసుకుంటారు.? నాదెండ్ల వాలకం చూస్తోంటే, జనసేకు వెన్నుపోటు పొడుస్తారేమో.. అని సోషల్ మీడియా వేదికగా వైసీపీ, టీడీపీ నెటిజనం చేస్తున్న ప్రచారంతో జనసైనికుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.