రాజకీయ నాయకులంటే ఉండాల్సింది జనంలో. ఇదే తెలియడంలేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు. పరిణాలు ఎలా ఉన్నా నాయకుడనేవాడు జనంతో మమేకమై ఉండాలి. అప్పుడే ఆయన మీద నమ్మకం, ఒక అంచనా ఏర్పడతాయి ఓటర్లలో. జనసేన గత ఎన్నికలో దారుణంగా దెబ్బతినడానికి కారణం ఓటర్లలో ఆ ఆపార్టీ మీద ఎలాంటి అంచనాలు లేకపోవడమే. అసలు పవన్ కళ్యాణ్ ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు అనేది ప్రజలకు ఒక ఐడియానే లేదు. నిజానికి జనసేనానికే లేదని అనాలి. ఆయనేం చేసినా ఉడికీ ఉడకని అన్నంలా ఉండే తప్ప ఎక్కడా ఇంపాక్ట్ అనేదే కనబడట్లేదు. మొదట్లో ఈ ప్రవర్తనను కొత్త కాదా అని జనం కొద్దిగా లైట్ తీసుకున్నా ఇప్పటికీ అదే ధోరణిలో ఉండటం చూసి ఇంకెప్పుడు మారేది అనుకుంటున్నారు.
కొన్నిరోజులు రాజకీయాలు, ఇంకొన్నాళ్ళు సినిమాలు, ఆ తర్వాత మళ్ళీ రాజకీయాలు. ఇలా ఉంది పవన్ ప్రస్థానం. నెలల తరబడి స్తబ్దుగా గడిపేసి ఒక్కసారి పూనక వచ్చినట్టు జనంలో పడిపోతారు. అలా పడినప్పుడు కార్యకర్తల హడావిడి చూడాలి మామూలుగా ఉండదు. మళ్ళీ మన నాయకుడు ఎపుడు బయటికొస్తాడో చెప్పలేం. కాబట్టి చేయాల్సిందంతా ఇప్పుడే చేయాలన్నట్టు రచ్చ రచ్చ చేసేస్తారు. మళ్ళీ కొన్నాళ్ళు సెలవులు. లాక్ డౌన్, సినిమాలు అంటూ 8 నెలలు బయటకురాని పవన్ ఈమధ్యే రైతుల సమస్యల మీద గళం విప్పారు. వరదల్లో నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలనీ లేకుంటే దీక్షకు దిగుతా అంటూ హెచ్చరించారు. ఆ హెచ్చరికలు చూసి దీక్ష భీభత్సంగా ఉంటుందని అనుకున్నారు అంతా. కానీ పవన్ దీక్ష చేసింది ఇంట్లో. ఈ ఇంట్లో దీక్ష కాన్సెప్ట్ ఏంటో ఎవ్వరికీ అంతుబట్టలేదు.
అది కూడ పొద్దున మొదలై సాయంత్రానికి ముగిసిపోయింది. ఇదేం దీక్ష బాబోయ్, జనంలోకి వచ్చి కదా దీక్షలు చేయాల్సింది అంటూ చాలామంది ముక్కున వేలేసుకున్నారు. జనసేన శ్రేణుల్లో కూడ ఇదే అభిప్రాయం ఉంది. కానీ బయటికి చెప్పుకోలేరు కదా. అందుకే విమర్శించేవారి మీద కౌంటర్లు వేస్తున్నారు. పవన్ కళ్యాణే గనుక బయటికొచ్చి దీక్ష చేస్తే ప్రభుత్వం తట్టుకోగలదా, రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. ఆయన ఇంట్లో దీక్ష చేయడం ప్రభుత్వానికి మంచిదైంది అంటూ కబుర్లు చెబుతున్నారు. ఇంకొందరైతే సత్తా మొత్తం ఇప్పుడే చూపెడితే ఎలా.. అందుకే పవన్ బయటికి రాలేదు అంటున్నారు. ఇప్పుడే కాదు మొదటి నుండి వారిది ఇదే మాట. పవన్ సంగతి మీకు తెలియదు. ఆయన అనుకుంటే అంతా తారుమారవుతుంది. ఇవే కబుర్లు చెబుతూ ఆరేడేళ్లు గడిపేశారు. ఒక క్షణం వారి మాటలే నిజం అనుకుందాం. మరి ఆ వీరత్వాన్ని దాచిపెట్టుకుని పవన్ ఏం సాధిద్దామని అనుకుంటున్నారో కూడ వాళ్ళే చెబితే బాగుంటుంది.