జనం.. చంద్రబాబు సైతం ఊహించనంత ప్రభంజనం.!

సంద్రం.. జన సంద్రం.! సునామీ, జన సునామీ.! తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మద్యంతర బెయిల్ పొంది, రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలైంది మొదలు, వుండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకునేవరకు.. అడుగడుగునా జన ప్రభంజనమే కనిపించింది.

నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రారంభమైన ‘యాత్ర’, ఈ రోజు తెల్లవారు ఝామున ఆరు గంటల వరకూ నిర్విరామంగా కొనసాగింది. గతంలో, అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరెస్టయి, పదహారు నెలల తర్వాత బెయిల్ మీద విడుదలయినప్పుడు ఎలాగైతే, ఆయన వెంట జనం కనిపించారో.. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో చంద్రబాబు వెంట జనం కనిపించారు.

చంద్రబాబు అరెస్టయినప్పుడు, ఆయనకి మద్దతుగా టీడీపీ శ్రేణులు హంగామా చేస్తాయనుకుంటే, అంత సీన్ ఎక్కడా కనిపించలేదు. చంద్రబాబు అరెస్టు తర్వాత కూడా టీడీపీ శ్రేణులు మొక్కుబడి నిరసనలు, ఆందోళనలే చేశాయి.

కానీ, చంద్రబాబుకి బెయిల్ రావడంతో, టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. టీడీపీకి జనసేన తోడవడంతో, చంద్రబాబు విడుదల యాత్ర కొత్త పొలిటికల్ గ్లామర్‌ని సంతరించుకుంది. చంద్రబాబు విడుదల పట్ల జనసేనాని హర్షం వ్యక్తం చేయడం, గత కొద్ది రోజులుగా టీడీపీ – జనసేన శ్రేణులు కలిసి పని చేస్తుండడం.. ఇవన్నీ నిన్నటి యాత్రలో ఇంపాక్ట్ ఎక్కువ చూపించినట్లుగా చెప్పుకోవచ్చు.

రాజమండ్రి నుంచి వుండవల్లి వరకు, టీడీపీ ముఖ్య నేతలు, తక్కువ సమయంలో పెర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో జనాన్ని మొబిలైజ్ చేయగలిగారు. స్వచ్ఛందంగా వచ్చిన జనం, దానికి తోడు తరలించిన జనం.. వెరసి, రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. చంద్రబాబుకి ఇంటి వద్ద దిష్టి తీసి, లోపలకు ఆహ్వానించారు ఆయన సతీమణి భువనేశ్వరి.