విశాఖ లెక్క మారింది.! బొత్స ఝాన్సీపై పాజిటివ్ రెస్పాన్స్.!

ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబందించి వైసీపీలో రాత్రికి రాత్రి ఈక్వేషన్ మారింది. మరీ ముఖ్యంగా విశాఖ పార్లమెంటు సీటు పరిధిలో, వైసీపీకి అనూహ్యంగా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది.! ఇదంతా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ, విశాఖ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల బరిలో దిగుతుండడం వల్లే.

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది అక్కడి ప్రజల్లో. భూ కబ్జా ఆరోపణలు సహా, చాలా ఆరోపణలు ఎంవీవీ సత్యనారాయణపై వచ్చాయి. ఆయన స్థానికేతరుడు. నిజానికి, విశాఖ ఎంపీ సీటుకి ప్రతిసారీ స్థానికేతరులే పోటీ పడుతూ వుంటారు. అదో ప్రత్యేకత. గెలిచేవాళ్ళు కూడా స్థానికేతరులే.

బొత్స ఝాన్సీ స్వస్థలం విశాఖపట్నం కావడం వైసీపీకి కలిసొచ్చే అంశం. సామాజిక వర్గం ఓటు బ్యాంకు కోణంలో చూసినా, బోల్డన్ని అనుకూలతలు వున్నాయి వైసీపీకి విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో.

బొత్స సత్యనారాయణపై ‘లిక్కర్ డాన్’ అనే ఆరోపణలు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వుండేవి. వైసీపీ హయాంలోనూ బొత్సపై అనేక ఆరోపణలు రావడం చూశాం. అయితే, గతంలోనూ ఎంపీగా పని చేసిన బొత్స ఝాన్సీకి క్లీన్ ఇమేజ్ వుంది. అదే ఆమెకు పెద్ద అడ్వాంటేజ్.

బొత్స ఝాన్సీకి వున్న ఆ పాజిటివ్ ఇమేజ్, వైసీపీకి ట్రాన్స్‌ఫర్ అవుతోంది. పైగా, మహిళా అభ్యర్థి కావడం ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ అన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. మొత్తమ్మీద, విశాఖలో వైసీపీ ఇమేజ్ పలచబడిందనుకుంటున్న తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్, పెర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో బొత్స ఝాన్సీని రంగంలోకి దించారు.

ఇక, ఇప్పుడు టీడీపీ కావొచ్చు జనసేన కావొచ్చు.. తమ కూటమి తరఫున ఎవర్ని బరిలోకి దించాలన్నదానిపై అయోమయంలో పడిపోయారనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ అల్లుడే ఈసారీ విశాఖ బరిలో వుంటారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.!