బదిలీల్లో  కనబడుతున్న  జగన్ ముద్ర

ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు నుండే జగన్మోహన్ రెడ్డి తన ముద్రను స్పష్టం చేశారు. ముందుగా చంద్రబాబునాయుడుకు మద్దతుగా ఉన్న డిజిపి ఆర్పీ ఠాకూర్ ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి బదిలీ చేశారు. అదే సమయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ గా ఉన్న గౌతమ్ సవాంగ్ కు ఫుల్ అడిషినల్ చార్జి అప్పగించారు.

చంద్రబాబు హయాంలో ఓ వెలుగు వెలిగిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయమన్నారు. అలాగే చంద్రబాబు కార్యాలయంలో చక్రం తిప్పిన సతీష్ చంద్ర, సాయిప్రసాద్, గిరిజా శంకర్, రాజమౌళిలను కూడా సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయమని చెప్పేశారు.

ఇక ప్రోటోకాల్ డైరెక్టర్ లెఫ్ట్ నెంట్ కల్నల్ అశొక్ బాబును కేంద్రానికి పంపేశారు. కేంద్ర రక్షణశాఖకు చెందిన అశోక్ బాబు  చంద్రబాబు హయాంలో బాగానే వెలిగారు. అందుకే ఆయన డిప్యుటేషన్ రద్దు చేసి కేంద్రానికి పంపేశారు.  లా సెక్రటరీ లాంటి ఇతర అధికారులను కూడా బదిలీ చేసేశారు. ఓ రెండు రోజుల్లో తన పేషీలో పనిచేసే మొత్తం టీంను రెడీ చేసుకోబోతున్నారు.

రెండు మూడు రోజుల్లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను కూడా బదిలీ చేయనున్నట్లు సమాచారం. పాలనలో తన ముద్ర ఉండాలంటే ప్రతీ కీలక పోస్టులోను సమర్ధులైన అధికారులే ఉండాలని జగన్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే బదిలీల విషయంలో చాలా స్పష్టంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.