1)తొలి అయిదు సంతకాలు ఏమయ్యాయి?
2)రైతులు, మహిళల రుణాలు మాఫీ అయ్యాయా?
3)చేనేతకారుల రుణాలు మాఫీ చేశారా?
4)20 లీటర్ల మినరల్ వాటర్ రూ.2కే ఇస్తున్నారా?
5)గ్రామాల్లో బెల్టు షాపులు ఎత్తి వేశారా?
ఇన్ని మాయమాటలు చెప్పి, మరి భవిష్యత్తుకు భరోసా ఎలా ఇస్తారు?
అని క్రిక్కిరిసన సభలో వైసిపి అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని సూటిగా ప్రశ్నించారు. ఈ రోజు జగన్ అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తూ వేసిన ప్రశ్నలివి.
పైన ఎండ మండుతున్నా లెక్క చేయని జనం ఎంతో చప్పట్లతో ఆయనను స్వాగతించారు. సభకు జనం పోటెత్తడంతో పట్టణంలో అంతులేని సందడి నెలకొంది.
జగన్ వేసిన మరిన్ని ప్రశ్నలు:
– చంద్రబాబు ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేసే వారే అయితే, హోదాను తాకట్టు పెట్టే వారా? ప్యాకేజీకి ఒప్పుకునే వారా?
– విపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా రూ.500 కోట్లకు కొనేవారా?
– పోలవరం ప్రాజెక్టు కడతామని కేంద్రం ప్రకటిస్తే, కమిషన్ల కోసం తానే కడతానని లాక్కునేవారా?
– ఇసుక దగ్గర నుంచి మట్టి దాకా, చివరకు దళితులు, గుడి భూములు వదిలిపెట్టకుండా దోచేవారా?.. అని శ్రీ వైయస్ జగన్ నిలదీశారు.
ఇంకా..
– ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తే అయితే 108 సర్వీసుల పరిస్థితి ఇవాళ ఇంత దారుణంగా ఉండేదా?
– ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు గార్చే వారా?
– పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేదా?
– రాష్ట్రంలోని 6 వేల స్కూళ్లు మూసి వేసి నారాయణ స్కూళ్లు మాత్రమే నడిచేలా చేసే వారా?
– రాష్ట్రంలో ఇవాళ ప్రతి ఒక్క కుటుంబం వివరాలు (పూర్తి వ్యక్తిగత సమాచారం) జన్మభూమి కమిటీ సభ్యులకు ఇచ్చేవారా?.. అని కూడా సూటిగా ప్రశ్నించారు.
రైతుల రుణాలు మాఫీ చేయకపోవడం వల్ల 2014లో రూ.87,612 కోట్లు ఉన్న ఆ రుణాలు గత ఏడాది సెప్టెంబరు నాటికి ఏకంగా రూ.1.37 లక్షల కోట్లకు పెరిగాయని.. ఇదేనా భరోసా? అని ప్రశ్నించారు.
అదే విధంగా 2014లో డ్వాక్రా రుణాలు రూ.14,205 కోట్లు కాగా, అవి గత ఏడాది సెప్టెంబరు నాటికి రూ.25,500 కోట్లకు పెరిగాయని జగన్ అన్నారు.
ప్రతి ఇంటికీ చంద్రబాబు బాకీ పడ్డాడు
నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం వల్ల 5 ఏళ్లకు గానూ ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డాడని, అది కూడా ఎగ్గొట్టారని తెలిపారు. మరి ఇదేనా భరోసా? అని జగన్ అన్నారు.
‘ఎన్నికలప్పుడు మోసం చేయాలి అన్న ఉద్దేశంతో మేనిఫెస్టో ప్రకటించి 650 వాగ్ధానాలు చేశారని, ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించి, ఆ తర్వాత అందరినీ మోసం చేశారని.. ఇదేనా భరోసా? అని నిలదీశారు.
కష్టాలు తెలుసుకున్నాను. ఇంతటి దారుణ పాలన మధ్య సుదీర్ఘ పాదయాత్ర చేశానని, దేవుడి దయ, ప్రజలందరి ఆశీర్వాదంతో 3648 కి.మీ నడిచి రాష్ట్రంలో ప్రతి చోటా తిరిగి అందరి కష్టాలు చూశానని, బాధలు స్వయంగా విన్నానని శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు. అందుకే ఈ వేదిక నుంచి ఒక మాట ఇస్తున్నానని చెప్పారు.
‘నేనున్నాను’, అని హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు.
వైయస్సార్‌సీపీ రాయదుర్గం నియోజకవర్గం అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి, అనంతపురం ఎంపీ అభ్యర్తి తల్లారి రంగయ్యను సభకు ఆయన పరిచయం చేశారు. శ్రీవారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ గుర్తు అయిన ఫ్యాన్‌ను కూడా ఆయన సభకు చూపారు.
(బ్యానర్ ఫోటో:అంతకు ముందు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో జగన్ ప్రసంగించినప్పటిది)