అవినీతి నియంత్రణకు కేరళ ప్రభుత్వం తరహాలో ఇక్కడ కూడా చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డే మరో 30 ఏళ్ళు సిఎంగా ఉంటారంటూ ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అవినీతి నియంత్రణకు జగన్ ఢిల్లీలో చెప్పిన విషయాలను ఉండవల్లి స్వాగతించారు. పరిపాలనలో పారదర్శకత కోసం జ్యుడిషియల్ కమీషన్ వేస్తామని జగన్ చెప్పటానికి మాజీ ఎంపి మద్దతిచ్చారు. మొత్తం దేశంలోనే ఇటవంటి కమీషన్ వేస్తామని ఏ ముఖ్యమంత్రి ప్రకటించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.
మొన్నటి ఎన్నికల్లో వైసిపి రాష్ట్రంలో చరిత్ర సృష్టించిందన్నారు. ఏపి రాజకీయాల్లో ఏ పార్టీకి కూడా 50 శాతం ఓట్లు రాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. 50 శాతం ఓట్లు తెచ్చుకుని అధికారంలోకి రావటమన్నది నిజమైన ప్రజాస్వామ్య స్పూర్తికి నిదర్శనమన్నారు.
మీడియా సమావేశంలో జగన్ మాట్లాడిన తీరు చూస్తే దివంగ ముఖ్యమంత్రి వైఎస్ మాటలే గుర్తుకొస్తున్నట్లు చెప్పారు. తాను మాట్లాడదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పటమే జగన్ కున్న బలంగా చెప్పారు. మనసులో ఉన్నది చెప్పటమే వైఎస్ అలావాటని గుర్తు చేశారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసియార్, ప్రధానమంత్రి నరేంద్రమోడితో సఖ్యతగా ఉండటం చాలా అవసరమన్నారు. చంద్రబాబు నెగిటివ్ ఓటుతోనే జగన్ అధికారంలోకి వచ్చారనటం తప్పన్నారు. వైసిపికి వచ్చిన ఓట్లలో చంద్రబాబు నెగిటివ్ ఓటుకన్నా జగన్ పాజిటివ్ ఓటే ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలోని అంశాలన్నింటినీ జగన్ సాధించాలని చెప్పారు.