రాజధాని భూముల స్కాంపై విచారణ

రాజధాని భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై కొత్త ప్రభుత్వం విచారణ జరిపించేందుకు రంగం సిద్ధమైందా ? కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న తర్వాత అందరిలోను ఇదే ఆరోపణలు మొదలయ్యాయి. రాజధాని పేరుతో చంద్రబాబునాయుడు భారీ    కుంభకోణానికి తెరతీసినట్లు జగన్ ఆరోపించారు. తన బినామీలతో పెద్ద ఎత్తున భూములు కొనిపించిన తర్వాతే అమరావతి ప్రాంతంలో రాజధానిని ప్రకటించినట్లు జగన్ ఆరోపించారు.

జగన్ ఆరోపించటమే కాకుండా ఇదే విధమైన ఆరోపణలు రాష్ట్రమంతటా ఉన్నాయి.  ముందు నూజివీడు ప్రాంతంలో రాజధానన్నారు. అక్కడ చాలామంది భూములు అమ్మేసుకున్న తర్వాత హఠాత్తుగా అక్కడ కాదు అమరావతి ప్రాంతంలో అని ప్రకటించారు. ఇలా ఒకటికి రెండు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు అప్పట్లో కావాలని అధికార పార్టీ ఫీలర్లు వదిలిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

అదే విషయాన్ని జగన్ ప్రస్తావిస్తు టిడిపికి చెందిన చాలామంది నేతలు భారీ ఎత్తున భూములను కొనేసి రైతులను నష్టపరిచినట్లు ఆరోపించారు. కాబట్టి భూముల కొనుగోలుపై విచారణ తప్పని పరిస్ధితులు వచ్చినట్లు స్పష్టంగా ప్రకటించారు. అందుకే 30వ తేదీన సిఎంగా బాధ్యతలు తీసుకోగానే  రాజధాని భూముల కొనుగోలుపై విచారణ జరిపిస్తారని ప్రచారం ఊపందుకుంది.

ఒకవైపు రైతులు సాగు  చేసుకుంటున్న భూములను రాజధాని పేరుతో బలవంతంగా లాగేసుకున్న ప్రభుత్వం మరోవైపు చంద్రబాబు అండ్ కో కొనుగోలు చేసిన భూములను మాత్రం ల్యాండ్ పూలింగ్ నుండి మినహాయించింది. చంద్రబాబు అండ్ కో కొన్న భూముల సరిహద్దులను ముందుగానే చూసుకుని సరిగ్గా అక్కడి వరకే ల్యాండ్ పూలింగ్ పరిధిని నిర్ణయించటం గమనార్హం. ఇలా ఒకటే కాదు అనేక రకాలుగా భారీ స్కాంలకు చంద్రబాబు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కాబట్టి వాటిపై విచారణ తప్పదన్నట్లుగా ఉంది జగన్ మాటలు.