సాక్షి మీడియా కన్సల్టింగ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు తనయుడు శ్రీహర్ష ఇటీవలే మరణించారు. తమ ఒక్కగానొక్క కొడుకు మరణంతో ఆ ఇంట విషాదం నెలకొంది. 32 ఏళ్ళ అతి చిన్న వయసులోనే కొడుకు మరణించడంతో కొమ్మినేని దంపతులు శోక సంద్రంలో మునిగిపోయారు.
శ్రీహర్ష ఉద్యోగరీత్యా కెనడాలో ఉంటున్నారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. శ్రీహర్ష మరణంతో ఆయన భార్య, కుమార్తె తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న శ్రీహర్ష తనువు చాలించారు.
కొద్దిరోజుల క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో కెనడా వెళ్లారు కొమ్మినేని దంపతులు. కొడుకు మరణించడంతో ప్రస్తుతం అక్కడే ఉన్నారు. కాగా శ్రీహర్ష మరణవార్త తెలుసుకున్న జగన్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఫోన్ చేశారు.
కొడుకు మృతితో కుమిలిపోతున్న కొమ్మినేనిని ఫోన్ ద్వారా పరామర్శించారు జగన్. కొమ్మినేని దంపతులను ఓదార్చారు. శ్రీహర్ష ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. సాక్షి ఎప్పుడు అండగా ఉంటుందని ధైర్యాన్ని ఇచ్చారు.
కొమ్మినేని శ్రీనివాసరావు కేఎస్సార్ గా సుపరిచితులు. కొమ్మినేని ప్రముఖ మీడియా సంస్థ సాక్షి టీవిలో మీడియా కన్సల్టింగ్ ఎడిటర్ గా ఉన్నారు. లైవ్ షో విత్ కేఎస్సార్ ను నిర్వహిస్తున్నారు. సాక్షి లో చేరక ముందు ఎన్టీవీలో చీఫ్ ఎడిటర్ గా పని చేశారు.
వీటికంటే ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు, దూరదర్శన్ వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ఎలెక్షన్ల మీద, శాసన సభ చర్చల సరళి మీద పుస్తకాలు రచించారు. ఆయన ఆంధ్రజ్యోతిలో అనేక ఆర్టికల్స్ రాసారు.
తెలంగాణ ఉద్యమకాలంలో కొమ్మినేని ఆంధ్ర జర్నలిస్టుగా ఉన్నప్పటికీ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఆయన రెండు ప్రాంతాల వారి వాదనల టీవీ చర్చల్లో సమ ప్రాధాన్యత ఇచ్చేవారని చెబుతుంటారు. ఉదయం ఏడున్నర అయిందంటే తెలంగాణ ఉద్యమ కాలంలో రాజకీయ అవగాహన ఉన్నవారంతా ఎన్టీవీ ముందు కూర్చునేవారు.