ఆంధ్రప్రదేశ్ రోడ్లు వర్సెస్ తెలంగాణ రోడ్లు.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రోడ్లు వర్సెస్ తెలంగాణ రోడ్లు.. అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరుగుతోంది.! ‘ఆంధ్రా సరిహద్దుల్లో సింగిల్ రోడ్లు.. అదే, తెలంగాణలో అడుగు పెడితే డబుల్ రోడ్లు..’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ఇటీవల ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలతో ఈ దుమారం షురూ అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ వ్యాఖ్యల్ని ఖండించలేదు. కానీ, సోషల్ మీడియాలో వైసీపీ వర్సెస్ టీఆర్ఎస్.. ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం నడుస్తోంది. టీడీపీ, జనసేన కూడా ఈ యుద్ధంలో పాల్గొంటున్నాయ్.. అదీ, వైసీపీకి వ్యతిరేకంగా. బీజేపీ కూడా రంగంలోకి దిగింది.

టీడీపీ అను‘కుల’ మీడియాలో భాగంగా చెప్పబడే ఈనాడులో, ఏపీ రోడ్ల దుస్థితి గురించి కథనాలు వస్తే, ఆ కథనాల్ని వైసీపీ అను‘కుల’ మీడియా ఖండిస్తోంది. వైసీపీ సొంత మీడియా సాక్షిలో రామోజీకి వ్యతిరేకంగా, తెలంగాణలో రోడ్ల దుస్థితిని పేర్కొన్న సంగతి తెలిసిందే. తద్వారా, తెలంగాణపై సాక్షి విషం చిమ్మిందనే వాదనకు తెరలేచింది.

రాజకీయం అంటేనే ఇది.! ఇలా తయారైంది రాజకీయం.! ఇంతకీ, తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు ఎలా వున్నాయ్.? కొన్ని చోట్ల రోడ్లు బావున్నాయ్.. కొన్ని చోట్ల రోడ్లు అద్వాన్నంగా వున్నాయ్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే, తెలంగాణలో రోడ్లు బెటర్.

ఆంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల రోడ్లు అధ్వాన్నంగా వున్నమాట వాస్తవం. అదిగో ఇదిగో.. అంటూ ఏళ్ళు గడిపేస్తున్నారు తప్ప, రోడ్లపై గుంతల్ని పూడ్చేసి, ‘ఇదీ మా ప్రభుత్వ ఘనత’ అని చెప్పుకోలేకపోతోంది వైసీపీ సర్కారు. వచ్చే ఎన్నికల్లో గుంతల రోడ్ల ఎఫెక్ట్ వైసీపీపై గట్టిగానే వుండబోతోందన్నది నిర్వివాదాంశం.