ఏ నాయకుడు చేయని ప్రకటన చేసిన జగన్

ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయని ప్రకటన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దీంతో సర్వత్రా ఆయన ప్రకటనపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. విశ్వ బ్రాహ్మణ సంఘానికి ఆయన ఒక హామీ ప్రకటన చేశారు. ఆదివారం విజయ నగరం నియోజక వర్గంలో పాదయాత్ర చేశారు జగన్. పాదయాత్రలో భాగంగా కోరుకొండలో విశ్వ బ్రాహ్మణులను కలిశారు. సుమారు అరగంటసేపు వారితో ముచ్చటించిన జగన్ పలు కీలక హామీలు ఇచ్చారు.

చట్ట సభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేలా విశ్వబ్రాహ్మణులకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణులది వెనుకబడిన సామజిక వర్గం. మొత్తం 20 లక్షల మంది ఈ సామజిక వర్గంలో ఉన్నారు. ఎప్పటి నుండో ఈ వర్గానికి చెందినవారు తమ వర్గం వారికి ఒక పదవిని ఇవ్వమని పార్టీలను డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి కోసం ఒక సీటు కేటాయిస్తూ ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేయని ప్రకటన చేశారు జగన్. కడప జిల్లా బ్రహ్మంగారి మఠమునందు ఈరోజు విశ్వ బ్రాహ్మణుల శంఖారావం జరిగింది. అదే రోజు జగన్ ఈ హామీ ప్రకటించటం విశేషం.

విశ్వబ్రాహ్మణులతో భేటీలో వచ్చిన మరిన్ని అంశాలపై సానుకూలంగా స్పందించారు జగన్. విశ్వబ్రాహ్మణులను బీసీ–బీ నుంచి బీసీ–ఏ లోకి మార్చాలన్న విజ్ఞప్తిపై స్పందించిన జగన్‌…రాజకీయ నాయకులు కులాల వ్యవస్థలో వేలు పెట్టకూడదని, కులాల గ్రూపుల మార్పు అంత సులభం కాదని స్పష్టం చేశారు. దీనికోసం బీసీ కమిషన్ తప్పనిసరిగా ఏర్పాటు చేసి ఆ డిమాండ్‌ను కమిషన్‌ ముందుంచుతామని తెలిపారు. కొన్ని కులాల ఓటు బ్యాంకు కోసం మిగిలిన కులాలకు నష్టం చేసే పరిస్థితి రాకూడదని, అందువల్ల కులాల గ్రూప్‌ మార్పునకు సంబంధించి రాజకీయ జోక్యం తగదని పేర్కొన్నారు.

విశ్వబ్రాహ్మణులు మాత్రమే మంగళసూత్రాలు తయారు చేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. కార్పొరేట్‌ జ్యుయెలరీ షాపుల నుంచి విశ్వబ్రాహ్మణులకు ఎదురవుతున్న పోటీని వారు సమర్థంగా ఎదుర్కొనేలా ప్రభుత్వం పూర్తి చేయూతనిస్తుందని హామీ ఇచ్చారు జగన్. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే తీర్మానం చేస్తామని, మంగళసూత్రాలు కేవలం విశ్వబ్రాహ్మణులు మాత్రమే తయారు చేసేలా చట్టం చేస్తామని ప్రకటించారు.

అదే విధంగా 45 ఏళ్లు దాటిన విశ్వబ్రాహ్మణుల మహిళలకు వైయస్సార్‌ చేయూత పథకంలో కార్పొరేషన్‌ ద్వారా నాలుగు విడతల్లో రూ.75 వేల సహాయం చేస్తామని అన్నారు. విశ్వబ్రాహ్మణులకు ఇబ్బందికరంగా ఉన్న జీఓ నెం.272. లో అభ్యంతరకరమైన క్లాజ్‌లు ఉన్నాయి. దొంగ బంగారం పేరుతో పోలీసులు వేధిస్తున్నారు కాబట్టి దాన్ని మారుస్తాము. ఆ జీఓ సవరించి పోలీసులు వేధింపులు లేకుండా చూస్తాము అని మాట ఇచ్చారు.