ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి ప్రయోజనం చేకూరేలా హామీలు ఇస్తున్నారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఆ హామీలను నెరవేర్చడం విషయంలో ఆయన ఫెయిలవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం కిడ్నీ రోగుల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిన జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఉద్ధానంలో మొత్తం 35,000 మంది కిడ్నీ రోగులు ఉండగా వాళ్లలో 4000 మంది ఇప్పటికే మృతి చెందారు. ఈ లెక్కలు స్వయంగా సీఎం జగన్ చెప్పిన లెక్కలు కావడం గమనార్హం. కిడ్నీ రోగులు ఎక్కువగా ఉన్న గ్రామాలలో డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెస్తామని జగన్ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఉద్దానంలో కిడ్నీ బాధితులకు పరీక్షలు చేయించుకునే పరిస్థితి లేదు. అదే సమయంలో డయాలసిస్ సేవలు అందుబాటులో లేవు.
రోగుల సంఖ్య సంవత్సరం సంవత్సరానికి పెరుగుతోంది. అర్హత ఉన్నా వేర్వేరు కారణాల వల్ల చాలామందికి ప్రభుత్వ పింఛన్ అందడం లేదు. ఇంజక్షన్ల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని ఇక్కడి రోగులు చెబుతుండటం గమనార్హం. ఐరన్, కాల్షియం ట్యాబ్లెట్లు మినహా ఇతర ట్యాబ్లెట్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
కిడ్నీ రోగులు పరీక్షల కోసం ప్రస్తుతం ప్రైవేట్ ల్యాబ్స్ పైనే ఆధారపడ్డారు. ముఖ్యమైన మందుల సరఫరా కూడా ఆగిపోవడంతో ఇక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. జగన్ సర్కార్ ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రభుత్వం ఇందుకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంది.