ఆంబులెన్స్ మాఫియాపై జగన్ సర్కార్ దృష్టి పెట్టాలా.. వాళ్ల తీరు మారదా?

Ys Jagan Shocking Statement

ఏపీలో జరుగుతున్న కొన్ని ఘటనలు ఏపీ ప్రభుత్వం కొన్ని విషయాలకు సంబంధించి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలియజేయడంతో పాటు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు అద్దం పడుతోంది. తిరుపతి జిల్లాలోని కేవీబీపురం మండలంలో తాజాగా దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. పాము కాటు వేసిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లే సరికి బాలుడు మృతి చెందాడు.

మృతదేహాన్ని ఆంబులెన్స్ లో తీసుకెళ్లడానికి అనుమతి లేకపోవడం, ప్రైవేట్ వాహనాలు దొరకకపోవడంతో మృతదేహాన్ని భుజాన వేసుకుని అల్లుడి ద్విచక్ర వాహనంపై చెంచయ్య అనే వ్యక్తి తీసుకెళ్లాడు. ఈ ఘటన విషయంలో పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు. మృతి చెందిన వాళ్లకు వాహనం కూడా సమకూర్చలేరా? అంటూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం గమనార్హం.

ఆంబులెన్స్ మాఫియా వల్లే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆస్పత్రులకు నిధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటం కూడా ఈ తరహా పరిస్థితి ఎదురవుతోంది. మృతదేహాలను తరలించడానికి వాహనాలను ఏర్పాటు చేయడంతో పాటు చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చేవాళ్లకు ఇబ్బందులు కలగకుండా జగన్ సర్కార్ దృష్టి పెట్టాల్సి ఉంది.

ఆంబులెన్స్ మాఫియా వల్ల గతంలో రోగులు ఇబ్బందులు పడిన ఘటనలు సైతం ఉన్నాయి. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కార్ ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా ఇలాంటి ఘటనల వల్ల ప్రభుత్వం పరువు పోతుందని చెప్పవచ్చు. అయితే వైద్యాధికారులు మాత్రం బాధితులు నిరాకరించడం వల్లే ప్రైవేట్ వాహనం ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు.