ఎన్నికల ముందు కేంద్రం ఓటాన్ అకౌంట్ ప్రవేశ పెట్టి.. నేడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం అధికారం చేపట్టే ప్రభుత్వాలు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతాయి. అయితే అందుకు పూర్తి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. కాలయాపనకు బాబు అనుభవంలోంచి వచ్చిన ఆలోచన ఇదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును.. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన కూటమి పార్టీలు.. అధికారంలోకి వచిన తర్వాత వాటికి కేటాయింపుల అంశాన్ని పక్కకు పెట్టి.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. దీనివల్ల ప్రత్యేకంగా పథకాలకు కేటాయింపులను వివరించాల్సిన అవసరం లేదన్నమాట! దీంతో.. చంద్రబాబు అనుభవం ఇలా కాలయాపన చేసే ఎత్తుగడలకు ఉపయోగపడుతుందంటూ వైసీపీ ఎద్దేవా చేస్తుంది.
వాస్తవానికి 2014 – 19లో ఏపీని పాలించిన చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే సమయానికి రూ.100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్న పరిస్థితి! ఆ సమయంలో సీఎంగా అనుభవం లేని జగన్ ఆ కుర్చీ ఎక్కారు. అయినప్పటికీ కోవిడ్ సమయంలోనూ ఎలాంటి ఎగవేతలూ లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అయితే… తాజాగా 2024లో చంద్రబాబు సీఎం అయ్యే సమయానికి ఖజానాలో రూ.5,655.72 కోట్లు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.
అయినప్పటికీ సుపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రజలు నిలదీస్తారనే ఆలోచనతో… పూర్తిస్థాయి బడ్జెట్ కు వెనకడుగు వేసి, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారని.. ఇంతకు మించిన ద్రోహం మరొకటి ఉండదని.. మరో రకంగా చెప్పుకుంటే ఇది చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనం అని అంటున్నారు. ఇదే సమయంలో… నిజంగా చిత్తశుద్ధి ఉంటే… సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం పథకాలకు ఎంతెంత బడ్జెట్ కేటాయిస్తున్నారనే విషయం అసెంబ్లీలో చెప్పాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది.
అయితే… చంద్రబాబు, పవన్ లు మాత్రం ఆ సహేతుకమైన ఆలోచన చేసే అవకాశం లేదని అంటున్నారు. పవన్ కూడా చంద్రబాబు తరహాలోనే… కాలయాపన చేసి, తిరిగి ఎన్నికలు వచ్చిన తర్వాత నేరాన్ని బీజేపీమీదో, మరొకరి మీదో వేసేసి, మరిన్ని సరికొత్త హామీలు ఇచ్చేస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారనే నమ్మకంతో ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయాలపై తాజాగా జగన్ ఘాటుగా స్పందించారు.
ఇందులో భాగంగా… ఈ ప్రభుత్వానికి భయం బాగా పెరిగిపోయిందని చెబుతున్న జగన్… ఆ భయం ఏస్థాయిలోకి వెళ్లిందంటే… ఈ ఏడాది కనీసం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టలేకపోయేటంతగా అని ఎద్దేవా చేస్తున్నారు. దేశంలో తొలిసారిగా ఓ రాష్ట్రం ఏడాదిలో 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ మీదే నడుస్తుందంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందో అర్థం అవుతుందని దుయ్యబట్టారు.
ఎన్నికల ముందు అలవిగాని హామీలు ఇచ్చి.. ఇప్పుడు వాటికి నిధులు కేటాయించాల్సి వస్తుందనే భయంతో.. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ’ అన్నచందంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు! జగన్ అన్నారనో, వైసీపీ నేతలు విమర్శించారనో కాదు కానీ… చంద్రబాబు మాత్రం ఈసారి పవన్ తో జతకట్టి మరీ ఏపీ ప్రజలను వంచిస్తున్నరనేది మాత్రం వాస్తవం అని అంటున్నారు పరిశీలకులు!