సంచలనం: శ్రీకాకుళం తుఫాను బాధితులకు జగన్ భారీ హామీ

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం తిత్లీ తుఫాను బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ఆయన పాదయాత్ర సాలూరు పట్టణంలో సాగింది. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మరో వారం రోజుల్లో తిత్లీ తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో 50 రోజులు గడుపుతానని ఆయన ప్రకటించారు. తిత్లీ తుఫాను వలన 3435 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈ నష్టాన్ని ఆయన పూడ్చలేకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు జగన్. ఇంకా ఆయన మాట్లాడుతూ…”జగన్ శ్రీకాకుళం ఎందుకు వెళ్లట్లేదని సీఎం తో సహా పలువురు నాయకులూ ప్రశ్నిస్తున్నారు. ఈ మాటలకు నవ్వాలో, ఏడవాలో తెలియట్లేదు.

సీఎం నువ్వా? నేనా? అని అడుగుతున్నాను. ఖజానా నీ దగ్గర ఉందా? నా దగ్గర ఉందా? అధికార యంత్రాంగం నీవద్ద ఉందా? నా దగ్గర ఉందా? అని చంద్రబాబుని ఉద్దేశించి ప్రశ్నించారు. నేను పాదయాత్ర చేస్తున్నాను కాబట్టి మా పార్టీ సీనియర్ నాయకులు బాధితుల తరపున నిలబడి సహాయక చర్యలు తీసుకుంటున్నారు. దీనికి చంద్రబాబు ఏమంటారో తెలుసా? ప్రతిపక్షం సహాయక కార్యక్రమాలు అడ్డుకుంటింది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రాలేదని చంద్రబాబు ప్రశ్నిస్తారు. ఏం చేసినా నిజాయితీగా చేసే చిత్తశుద్ధి మాకుందని జగన్ పేర్కొన్నారు. పింఛన్లు పెంచడానికి చంద్రబాబుకు మనసు రాదు. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాన్న పేదవారి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకుగా జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తాడు అని చెప్పారు జగన్. పింఛన్ వెయ్యి నుండి రెండు వేలకు పెంచుతానని ప్రకటించారు. దీనికి సంబంధించి ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలి అనుకుంటే ముందుకు రావచ్చు అని పిలుపునిచ్చారు జగన్.